నాయకులు ఏం మాట్లాడినా చెల్లుతుందనే రోజులు పోయాయి. ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం ఎక్కువగా ఉంది. అంతేకాదు.. ఎవరు ఎలాంటి కామెంట్లు చేస్తున్నారో.. వారి విధి విధానాలు ఏంటో కూడా ప్రజలు గమనిస్తున్నారు. ఈ క్రమంలో నాయకులు ఒకింత ఆచి తూచి మాట్లాడాల్సి ఉంది. కానీ, ఎన్నికల వేళ నాయకులు.. ఈ విషయాన్ని ఎక్కడో విస్మరిస్తున్నారు. దీంతో వారికే ఎసరొచ్చే ప్రమాదం పొంచి ఉందని పరిశీలకులు చెబుతున్నారు. తాజాగా మంత్రి హరీష్ రావు.. బీఆర్ ఎస్ అభ్యర్థుల పక్షాన ప్రచారం చేస్తున్నారు.
ఈ క్రమంలో ఆయన కీలకమైన వ్యాఖ్య చేశారు. “అబద్ధాలు చెప్పే నాయకులను నమ్మొద్దు. అబద్దాలు చెప్పే పార్టీలను నమ్మొ ద్దు” అని పిలుపునిచ్చారు. ఈ మాటలను సాధారణ ప్రజలు అంతగా గమనించారో లేదో కానీ.. కాంగ్రెస్ పార్టీ వెంటనే పట్టేసింది. అంతేకాదు.. తనకు అనుకూలంగా ఎదురు దాడి చేసేస్తోంది. గజ్వేల్ పట్టణంలోని ఇంద్ర పార్క్ చౌరస్తా దగ్గర జరిగిన రోడ్డు షోలో హరీష్‌రావు పాల్గొని జాతీయ పార్టీలపై మండిపడ్డారు. ఈ క్రమంలో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు చెప్పే అబద్ధాలను నమ్మొద్దని అన్నారు. అంతేకాదు.. ఇరు పార్టీల అభ్యర్తులు వందల కొద్దీ అబద్ధాలు చెబుతారని.. వాటిని కూడా నమ్మొద్దని పిలుపునిచ్చారు.
ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా విభాగం ఆ వెంటనే.. “ఏది అబద్ధం.. ఏది నిజం” అంటూ.. యాంటీ క్యాంపెయిన్ ప్రారంభించింది. కేసీఆర్ గతంలో చెప్పిన ఎస్సీ అభ్యర్థిని సీఎం చేస్తాం దగ్గర నుంచి రాష్ట్రంలో రైతులు పసిడి పంటలు పండిస్తున్నారన్న వ్యాఖ్యల వరకు.. అనేక విషయాలను జోడించి.. ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలతో ఎండగట్టే ప్రయత్నాలు ప్రారంభించింది. అంతేకాదు.. ఔను అబద్ధాలు ఆడే వారిని తరిమికొట్టాల్సిందే
అని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తోంది.
నిజానికి పదేళ్ల పాలనలో కేసీఆర్ అనేక హామీలు ఇచ్చారు. దళితులకు ఎకరా బూమి ఇస్తామన్నారు. రాష్ట్రం మొత్తం దళిత బంధు ఇస్తామని చెప్పారు. రైతు ఆత్మహత్యలు లేని రాజ్యం చేస్తామన్నారు. 24 గంటల విద్యుత్ ఉచితంగా ఇస్తామన్నారు. ఇక, నిరుద్యోగులకు ఏటా నియామకాలు చేపడతామన్నారు. ఇంకా ఏవేవో హామీలు గుప్పించారు. అయితే.. వాటిని సాకారం చేయకలేక పోయారనేది కాంగ్రెస్ వాదన. ఈ క్రమంలో ప్రస్తుతం హరీష్‌రావు చేసిన “అబద్ధాలు చెప్పేవారిని నమ్మొద్దు” కామెంట్స్‌ను జోడించి.. వాటిని తెరమీదికి తెచ్చింది. దీంతో హరీష్‌రావు కామెంట్లు కాంగ్రెస్ లౌక్యంగా వాడుకుని ప్రచారం చేస్తోందనే టాక్ వినిపిస్తోంది.