యూట్యూబ్‌తో వైసీపీ ఒప్పందం.. ఎందుకు? ఏమిటి?

యూట్యూబ్‌లో ఇప్పుడు మీరు ఏదైనా సినిమానో.. లేక ఇత‌ర కార్య‌క్ర‌మాల్లో చూస్తున్నార‌ని అనుకుందాం. స‌డెన్‌గా మ‌ధ్య‌లో యాడ్స్ రావ‌డం కామ‌న్‌. ఇవి 5 సెక‌న్లు గ్యారెంటీగా చూడాలి. కొన్ని కొన్ని స‌ద‌రు యాడ్స్ అయ్యేవ‌ర‌కు చూడాలి. ఇలా యాడ్స్ ఇవ్వాలంటే.. నేరుగా యూట్యూబ్ తోనే ఒప్పందం చేసుకోవాలి. ఇదేమీ త‌క్కువ మొత్తం కాదు. కోట్ల‌లోనే ఉంటుంద‌ని అంటారు. ఇప్పుడు.. వైసీపీ కూడా ఇలాంటి ఒప్పంద‌మే చేసుకుంద‌ని తెలుస్తోంది.

దాదాపు 300 కోట్ల రూపాయ‌ల‌తో యూట్యూబ్‌తో ఒప్పందం చేసుకున్నార‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల్లో గుస‌గుస వినిపిస్తోంది. గ‌త 10 రోజులకుపైగా యూట్యూబ్‌లో వైసీపీ అధినేత జ‌గ‌న్ యాడ్స్ పెరిగిపోయాయి. ఆయ‌న చేసిన అభివృద్ధి, సంక్షేమం, ఇత‌ర కార్య‌క్ర‌మాల గురించి అన్ని యూట్యూబ్ కార్య‌క్ర‌మాల్లోనూ 10 సెకన్ల‌కు త‌గ్గ‌కుండా.. యాడ్ వ‌స్తోంది. దీనిలో అన్నీ నేరుగా లైవ్ కార్య‌క్ర‌మాలు.. కొన్ని ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణ‌లు ఉంటున్నాయి.

మ‌రికొన్ని చంద్ర‌బాబు ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు కూడా ఉంటున్నాయి. మొత్తంగా యూట్యూబ్‌లో వ‌చ్చే కార్య‌క్ర‌మాలు ఏవైనా కూడా మ‌ధ్య‌లో వైసీపీ యాడ్స్ ఖ‌చ్చితంగా వ‌స్తున్నాయి. వీటికి గాను ఆరు మాసాల‌కు ఒప్పందం జ‌రిగింద‌ని తాడేప‌ల్లి వ‌ర్గాల నుంచి తెలుస్తున్న మాట‌. ఈ క్ర‌మంలో మొత్తం 300 కోట్ల‌ను యూట్యూబ్‌కు ఒప్పందంగా చెల్లించార‌ని అంటున్నారు.

ఎన్నిక‌ల‌కు వాస్త‌వంగా మ‌రో 4 మాసాల గ‌డువు ఉంది. అయిన‌ప్ప‌టికీ.. ఇప్పుడే.. ఇలా ప్ర‌చారం ప్రారంభించ‌డం.. అందునా.. 300 కోట్ల‌తో ఒప్పందం చేసుకోవ‌డం ఆశ్చ‌ర్యంగానే ఉంద‌ని ప‌రిశీల‌కులు కూడా చెబుతున్నారు. ఇక్క‌డ ఇంకో విష‌యం ఏంటంటే.. కంపెనీ యాడ్స్‌కు ఒక రేటు ఉంటే.. పొలిటిక‌ల్ యాడ్స్‌కు మ‌రో రేటు ఉంటుంది. ఎంతైనా ఫ‌ర్వాలేద‌నేలా వైసీపీ యాడ్స్ ఇచ్చింద‌ని అంటున్నారు. మ‌రి ఇది.. ప్ర‌జాధ‌న‌మా? లేక పార్టీ ఫండా? అనేది సందేహ‌మే!