“సీఎం కావాల‌ని నాకూ ఉంది.. అవుతుందా?”

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నాయ‌కురాలు.. కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌద‌రి తాజాగా సంచల‌న వ్యాఖ్య‌లు చేశారు. తెలంగాణ ఎన్నిక‌ల్లో పార్టీ అధికారంలోకి రాక‌ముందే.. చాలా మంది నాయ‌కులు సీఎం సీటు కోసం కర్చీఫ్ ప‌రిచేసిన విష‌యం తెలిసిందే. జానా రెడ్డి నుంచి భ‌ట్టి విక్ర‌మార్క వ‌ర‌కు అనేక మంది సీఎం సీటు త‌మ‌ద‌నే భావ‌న‌తో ఉన్నారు. ఈ విష‌యంపై తాజాగా రేణుకా చౌద‌రి స్పందించారు. “సీఎం కావాల‌ని నాకూ ఉంది. అయితే.. ఇదంతా అవుతుందా?!” అని పెద‌వి విరిచారు.

క‌ర్ణాట‌కలో ఈ ఏడాది మేలో జ‌రిగిన ఉదంతాన్ని ఆమెప్ర‌స్తావించారు. అక్క‌డ సీఎం సీటు కోసం ఎంత పోరు జ‌రిగిందో చూశారు క‌దా.. అంటూ ఆమె వ్యాఖ్యానించారు. డీకే శివ‌కుమార్ ను సీఎంగా అనుకున్నార‌ని, కానీ, చివ‌ర‌కు పార్టీ అధిష్టానం.. సిద్ద‌రామ‌య్య‌ను ఎంపిక చేసింది క‌దా! అలానే ఇక్క‌డ కూడా ఎంతో మంది అనుకుంటారని.. చివ‌ర‌కు అధిష్టానం నిర్ణ‌య‌మే అంద‌రికీ ఆమోద‌యోగ్యం అవుతుంద‌ని తేల్చి చెప్పారు. ఈక్ర‌మంలోనే త‌న‌కు కూడా సీఎం కావాల‌నే ఉంద‌ని అన‌డం గ‌మ‌నార్హం.

ఎన్ని అడ్డంకులు వచ్చినా.. ఎవరు అడ్డు పడ్డా ఖ‌మ్మం జిల్లాలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేస్తుంద‌ని, రాష్ట్రంలోనూ అధికారంలోకి వ‌స్తుంద‌ని రేణుకా చౌదరి అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసేంత స్థాయిలో కాంగ్రెస్‌కు సీట్లు వ‌స్తాయ‌ని ఆమె చెప్పారు. పార్టీ ప్ర‌క‌టించిన ఆరు గ్యారంటీలు ప్రజల్లోకి బ‌లంగా వెళ్లాయ‌న్నారు. బీఆర్ఎస్ కొత్త సినిమాను ప్రజలు నమ్మరని.. ఈ ఎన్నికలలో బీఆర్ఎస్‌కు ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు.

ఓట‌ర్ల‌కు డబ్బులు పంచి గెలుద్దాం అనుకునే వారికి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని రేణుక‌ అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని తెలిపారు. అసమర్ధ ప్రభుత్వాలు ప్రజలను హింసించాయ‌ని, అందుకే కాంగ్రెస్‌ను కోరుకుంటున్నార‌ని ఆమె తెలిపారు. ముఖ్యంగా రాష్ట్రంలోని మైనారిటీ వ‌ర్గం మొత్తం కాంగ్రెస్ వెంట ఉంద‌ని ఆమె వ్యాఖ్యానించారు. త‌న‌కు ఎవ‌రిపైనా అసంతృప్తి లేద‌ని రేణుక చెప్పారు.