తెలుగుదేశంపార్టీలో యువనేత గంటి హరీష్ మాధుర్ పోటీచేసే స్ధానంపై జిల్లాలో పెద్దఎత్తున చర్చ జరుగుతోంది. గంటి హరీష్ అంటే చాలామందికి తెలియకపోవచ్చు కానీ లోక్ సభ మాజీ స్పీకర్ బాలయోగి కొడుకు హరీష్ అంటే మాత్రం వెంటనే గుర్తుపడతారు. యువత కోటాలో తనకు టికెట్ దక్కుతుందని అనుకుంటున్నాడు. హరీష్ దృష్టంతా అమలాపురం లేదా పీ గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గాలపైనే ఉందని పార్టీలో టాక్. అయితే పార్టీ మాత్రం హరీష్ ను అమలాపురం లోక్ సభకు పోటీచేయమని అడుగుతున్నట్లు సమాచారం.
పోయిన ఎన్నికల్లో హరీష్ అమలాపురం పార్లమెంటు నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయారు. దాంతో లోక్ సభ ఎన్నికలకన్నా అసెంబ్లీ అయితేనే తనకు బెటరని హరీష్ అనుకుంటున్నాడట. అందుకనే పై రెండు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎందులో అయినా సరే పోటీచేయటానికి రెడీగా ఉన్నట్లు ఇప్పటికే పార్టీ పెద్దలకు చెప్పాడట. అయితే నిర్ణయం ఏమిటన్నది ఇంకా తేలలేదు. మధ్యలో జనసేనపొత్తు పొత్తు అనివార్యమైంది కదా అందుకనే ఇప్పటికప్పుడు ఏ విషయంపైనా వెంటనే నిర్ణయం తీసుకునే పరిస్ధితిలో టీడీపీ లేదు.
నిజానికి ఎంపీగా పోటీ అంటే జనాలతో పెద్దగా సంబంధం ఉండదనే చెప్పాలి. ఎందుకంటే జనాలకు అవసరమైన పనులేవీ ఎంపీ చేయటానికి ఉండదు. జనాలు కూడా పొద్దున లేచిందగ్గర నుండి రాత్రివరకు ఎంఎల్ఏల దగ్గరకే వెళతారు. ఎందుకంటే జనాలకు ఎక్కువగా రాష్ట్రప్రభుత్వంతోనే పనికానీ కేంద్రప్రభుత్వంతో ఏముంటుంది ? పైగా ఎంపీలు నియోజకవర్గాల్లో పర్యటించాలంటే ఎంఎల్ఏలకు ముందుగా చెప్పాలనే పార్టీ ప్రోటోకాల్ ఒకటుంది. అలా చెప్పకుండా పర్యటిస్తే ఎంఎల్ఏలతో గొడవలైపోతాయి.
ఎంఎల్ఏలు సహకరించకపోతే ఎంపీ గెలుపు అనుమానంలో పడిపోతుంది. ఏడు అసెంబ్లీల్లోను ఎంఎల్ఏలు గెలుపుతో సంబంధంలేకుండా గెలిచిన ఎంపీ దాదాపు ఎవరూ లేరనే చెప్పాలి. అందుకనే డబ్బు పెట్టుకునే స్తోమతున్న ప్రతి నేత అసెంబ్లీ ఎన్నికలవైపే మొగ్గు చూపుతారు. చివరగా పార్టీ అధ్యక్షుడు గట్టిగా చెబితే మాత్రమే పార్లమెంటు ఎన్నికల్లో పోటీచేస్తారు. అయితే జనాల్లో తిరగటం అక్కరలేదని, జాతీయ రాజకీయాలపై ఆసక్తి ఉన్న కొందరు మాత్రం డైరెక్టుగా పార్లమెంటుకు పోటీచేయటంపై ఎక్కువగా ఇంట్రెస్టు చూపుతారు. అయితే ఇలాంటి వాళ్ళ సంఖ్య తక్కువనే చెప్పాలి. మరి ఈ నేపధ్యంలోనే హరీష్ పోటీ ఎక్కడనుండి అన్నది ఉత్కంఠగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates