టీడీపీతో జనసేన పొత్తు ఉంటుందని అధికారికంగా జనసేనాని పవన్ కల్యాణ్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత హిందూపురం ఎమ్మెల్యేతోపాటు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో పవన్ కల్యాణ్ భేటీ అయి భవిష్యత్ కార్యచరణపై చర్చలు జరిపారు. ఈ క్రమంలోనే జనసేన-టీడీపీ జాయింట్ యాక్షన్ కమిటీ, మేనిఫెస్టో కమిటీ వరుస సమావేశాలు నిర్వహించి ఉమ్మడి కార్యచరణతో ముందుకు పోతున్నాయి. ఈ నేపథ్యంలోనే హిందూపురంలో నిర్వహించిన టీడీపీ-జనసేన సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న బాలయ్య… జనసేనాని పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తనకు పవన్ తో భావసారూప్యత ఉందని, తామిద్దరం ముక్కుసూటిగా మాట్లాడే వాళ్లమేనని బాలయ్య అన్నారు. ప్రజా ఉద్యమంలో పాల్గొనాలని ఇద్దరం రాజకీయాల్లోకి వచ్చామని చెప్పారు. టీడీపీ, జనసేన కలయిక రాష్ట్రంలో కొత్త శకానికి నాంది పలుకుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లోఅన్ని స్థానాలను తమ కూటమి గెలుచుకోవాలని ఆకాంక్షించారు. నేరస్తులు, హంతకుల పాలనతో ఏపీలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు అందరూ కలిసి పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు. వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచించారు.
ప్రతిపక్షంలో ఉండి కూడా హిందూపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళుతున్నామని, పరిపాలన చేతకాక 3 రాజధానులంటూ జగన్ కాలయాపన చేస్తున్నాడని విమర్శించారు. పారిశ్రామిక సదస్సులంటూ పెయిడ్ ఆర్టిస్టులతో కార్యక్రమాలు నిర్వహించి ఒక్క పరిశ్రమ కూడా తేలేదని ఎద్దేవా చేశారు. ఐదేళ్ల జగన్ పాలనలో ఏపీ పదేళ్లు వెనకబడిపోయిందని, ఈ అరాచక ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలంతా ఆందోళన చేయాలని బాలకృష్ణ పిలుపునిచ్చారు.