కేటీఆర్ సీఎం అవుతారనే బీఆర్ఎస్ లో ఉన్నా: పొంగులేటి

ponguleti srinivas reddy
ponguleti srinivas reddy

మరికొద్ది రోజుల్లో తెలంగాణ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచార జోరు పెంచారు అన్ని పార్టీల నేతలు. ఈ క్రమంలోనే ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి..తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. పొంగులేటిపై ఐటీ సోదాలు జరిగిన నేపథ్యంలో ఓ మీడియా చానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్న పొంగులేటి…కేసీఆర్, కేటీఆర్ ల పై షాకింగ్ కామెంట్లు చేశారు. త్వరలో తాను సీఎం అవుతానని, అప్పటివరకు ఓపిక పట్టాలని కేటీఆర్ చెబితేనే ఇన్నాళ్లు పార్టీలో ఉన్నానని పొంగులేటి సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇన్నాళ్లు తాను బీఆర్ఎస్ లో ఉండడానికి కేటీఆరే కారణం అని పొంగులేటి చెప్పారు. నాన్న అంతే ఉంటాడులేన్నా, నేను 2 నెలల్లో సీఎం అవుతా..3 నెలల్లో సీఎం అవుతా…6 నెలల్లో సీఎం అవుతా..నేనే కదన్నా…నీకు ఆన్సర్ చేసేది..అని కేసీఆర్ తనకు నచ్చజెబుతూ వచ్చాడని అన్నారు. ఇంకా కాస్త ఓపిక పట్టు అన్నా అని నచ్చజెప్పాడని పొంగులేటి చెప్పారు. ఓ ఫైన్ మార్నింగ్ చేతులెత్తేశాడని, ఆ తర్వాత తాను బీఆర్ఎస్ లో ఉపయోగం లేదు కాబట్టి పార్టీ మారానని చెప్పారు. ఎప్పుడూ ఏ మనిషిని కలిసేందుకు, కలిసి సమస్య వినే ప్రయత్నం, దానిని పరిష్కరించే ప్రయత్నం కేసీఆర్ చేయలేదని ఆరోపించారు.

ఒక రాజకీయ నాయకుడిగా తన దగ్గరకు కూడా చాలామంది చాలా సమస్యలు చెప్పుకునేందుకు వస్తారని, అన్ని సమస్యలు పరిష్కరించడం ఎవరి వల్లా కాదని అన్నారు. అయితే, సమస్య వినే ఓపిక, సమస్య చెప్పుకునే వారికి కనీస గౌరవం కూడా ఉండకపోవడం బాధాకరమని చెప్పారు. కేటీఆర్ తర్వాతి సీఎం అంటూ జరుగుతున్న ప్రచారానికి పొంగులేటి వ్యాఖ్యలు ఊతమిచ్చాయి.