అమ్మ‌కు అన్నం పెట్టలేనోడు… చంద్ర‌బాబుపై జ‌గ‌న్

టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై ఏపీ సీఎం జ‌గ‌న్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ప‌ల్నాడు జిల్లా మాచ‌ర్ల‌లో వ‌రిక‌పూడి శెల ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి శంకుస్థాప‌న చేసిన అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. త‌మ ప్ర‌భుత్వం అభివృద్ధికి క‌ట్టుబ‌డి ఉంద‌న్నారు. 14 ఏళ్లు సీఎంగా చేసిన వ్య‌క్తి ఈ ప్రాజెక్టుకు క‌నీసం అనుమ‌తులు కూడా తీసుకురాలేక‌పోయార‌ని చంద్ర‌బాబుపై విమ‌ర్శ‌లు గుప్పించారు. తాము అన్ని అనుమ‌తులు తీసుకున్నాకే .. వ‌రిక‌పూడిశెల‌కు శంకుస్థాప‌న చేశామ‌ని, ఈ నెల 6నే కేంద్ర అట‌వీ శాఖ అనుమ‌తులు ఇచ్చింద‌ని జ‌గ‌న్ చెప్పారు.

ఇదే వేదిక‌పై సీఎం జ‌గ‌న్ రాజ‌కీయ విమ‌ర్శ‌లు గుప్పించారు. అమ్మ‌కు అన్నం పెట్ట‌లేనోడు.. పిన్న‌మ్మ‌కు బంగారు గాజులు చేయిస్తాన‌న్న‌ట్టు చంద్ర‌బాబు వ్య‌వ‌హారం ఉంద‌ని సీఎం జ‌గ‌న్ వ్యాఖ్యానించారు. పేద‌లు మ‌హిళ‌ల కోసంఒక్క ప‌థ‌కం పెట్టిన చ‌రిత్ర కూడా చంద్ర‌బాబుకు లేద‌న్నారు. మ‌రోసారి అధికారం ఇవ్వాల ని చంద్ర‌బాబు కోరుతున్నార‌ని..ప్ర‌జ‌లు ఆలోచించాల‌ని జ‌గ‌న్ అన్నారు. ఎస్సీల్లో ఎవ‌రైనా పుట్టాల‌నుకుంటారా? అని చంద్ర‌బాబు అన్నార‌ని జ‌గ‌న్ గుర్తు చేశారు.

బీసీల తోక‌లు క‌ట్ చేస్తాన‌ని అహంకార పూరితంగా చంద్ర‌బాబు మాట్లాడార‌ని జ‌గ‌న్‌ అన్నారు. పేద‌లు, మ‌హిళ‌ల కోసం ఒక్క ప‌థ‌క‌మైనా ప్ర‌వేశ‌పెట్టారా? అని ప్ర‌శ్నించారు. “కూతురిని ఇచ్చిన మామ‌కు వెన్నుపోటు పొడిచిన వాడు.. పేద‌ల‌కు వెన్నుపోటు పొడ‌వ‌కుండా ఉంటాడా?” అని జ‌గ‌న్ అన్నారు. చంద్ర‌బాబు అధికారంలో ఉండి ఉంటే ఆర్టీసీ, విద్యుత్‌ల‌ను ప్రైవేటు ప‌రం చేసేవార‌ని, ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల‌ను కూడా తీసేసేవార‌ని విమ‌ర్శించారు. క‌ష్ట‌కాలంలోనూ తాము సంక్షేమాన్ని ఆప‌లేద‌ని సీఎం జ‌గ‌న్ చెప్పారు.

చంద్ర‌బాబు త‌న బినామీల భూముల ధ‌ర‌లు పెంచుకునేందుకే అమ‌రావ‌తి రాజ‌ధానిని ఎంచుకున్నారని జ‌గ‌న్ విమ‌ర్శించారు. మూడు ప్రాంతాల‌కు స‌మ‌న్యాయం చేయాల‌ని చంద్ర‌బాబు ఎప్పుడైనా ఆలోచించారా? అని ప్ర‌శ్నించారు. “చంద్ర‌బాబు మోసాల పాల‌న‌ను చూశాం. రేపు ఎన్నిక‌ల్లో కేజీ బంగారం, బెంజ్‌కారు కూడా ఇస్తామ‌ని హామీ ఇస్తారు” అని వ్యంగ్యాస్త్రాలు రువ్వారు.