క‌విత అండ‌ర్ క‌రెంట్ పాలిటిక్స్‌.. చూశారా..?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల స‌మ‌యంలో విజ‌యం ద‌క్కించుకుని మూడోసారి కూడా అధికారం చేజిక్కిం చుకోవాల‌ని భావిస్తున్న అధికార పార్టీ బీఆర్ ఎస్ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంది. సీఎం కేసీఆర్ కుటుంబానికే చెందిన త‌న‌యుడు, త‌న‌య‌, మేన‌ల్లుడు.. స‌హా ఇత‌ర నేత‌లు క్షేత్ర‌స్థాయిలో ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. ప్ర‌జ‌ల‌ను త‌మ‌వైపు మ‌ళ్లిస్తున్నారు. ఈ క్ర‌మంలో మీడియా ముందు క‌నిపిస్తున్నది కేవ‌లం కేసీఆర్‌(బ‌హిరంగ స‌భ‌ల్లో), కేటీఆర్‌, హ‌రీష్‌రావు

వీరిలోనూ కేసీఆర్ కేవ‌లం జిల్లాల్లో సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లుచేస్తున్నారు. రోజుకు రెండు నుంచి మూడు జిల్లాల్లో ఆయ‌న ప‌ర్య‌టిస్తున్నారు. ఇప్ప‌టికే ప‌లు జిల్లాల‌ను క‌వ‌ర్ చేసిన కేసీఆర్‌.. ఎన్నిక‌ల‌కు 10 రోజుల ముందు నుంచి మ‌రింత దూకుడు పెంచాల‌ని నిర్ణ‌యించారు. రెండు మూడురోజుల‌కు ఒక‌సారి ప్రెస్ మీట్ పెట్ట‌నున్నార‌ని తెలిసింది. ఇక‌, కేటీఆర్ ఒక‌ వైపుజిల్లాల ప‌ర్య‌ట‌న‌లు చేస్తూ.. బ‌హిరంగ స‌భ‌ల్లో ప్ర‌సంగిస్తూనే.. మ‌రో వైపు మీడియా సంస్థ‌ల‌కు ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు.

ఇక‌, హ‌రీష్‌రావు కూడా.. మీడియాల‌కు ప్ర‌త్యేక ఇంట‌ర్వ్యూలు ఇస్తున్నారు. ఇదే స‌మ‌యంలో జిల్లా స్థాయి లో కుల‌, మ‌త సంఘాల‌ను ఏకం చేసే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. అయితే.. ఈ మొత్తం వ్య‌వ‌హారంలో పైకి క‌నిపించ‌ని నాయ‌కురాలు కేసీఆర్ త‌న‌య క‌ల్వ‌కుంట్ల క‌విత‌. ఎన్నిక‌ల ప్ర‌చారం ప్రారంభ‌మై.. చాలా రోజులు అయినా. క‌విత ఎక్క‌డా మీడియాకు చిక్క‌డం లేదు. క‌నీసం ఇంట‌ర్వ్యూలు కూడా ఇవ్వ‌డం లేదు. దీంతో ఆమె ఊసు ఎక్కడా వినిపించ‌డం లేదు.

కానీ, క‌విత చాలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మండ‌ల స్థాయిలో ఆమె ప‌ర్య‌టిస్తున్నారు. ప్ర‌ధాన మీడియాకు దూరంగా నేరుగా ప్ర‌జ‌ల‌ను క‌లుసుకుంటున్నారు. అభ్య‌ర్థుల ప‌క్షాన ప్ర‌చారం చేస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ.. మ‌హిళ‌ల‌కు బొట్టు పెట్టి మ‌రీ ఓటు వేయాల‌ని.. బీఆర్ఎస్ ప్ర‌భుత్వాన్ని ఆశీర్వ‌దించాల‌ని క‌విత కోరుతున్నారు.

ఇలా.. ఆమె ప్ర‌ధాన మీడియా ముందుకు రాక‌పోవ‌డానికి.. లిక్క‌ర్ స్కాంలో త‌న పేరు ఉండ‌డ‌మే కార‌ణ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. బ‌య‌ట‌కు వ‌చ్చి నేరుగా విమ‌ర్శ‌లు గుప్పిస్తే.. ప్ర‌తిప‌క్ష నాయ‌కులు.. ఆమెను లిక్క‌ర్ స్కాం పేరుతో టార్గెట్ చేసే అవ‌కాశం ఉంద‌ని భావిస్తున్నారు. అందుకే వారికి ఛాన్స్ ఇవ్వ‌రాద‌నే ఉద్దేశంతో క‌విత చాలా తెలివిగా అండ‌ర్ క‌రెంట్ పాలిటిక్స్ చేస్తున్నార‌ని అంటున్నారు.