కేటీఆర్ సీఎం అయినా అభ్యంతరం లేదు: హరీష్ రావు

తెలంగాణ ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు, ఐటీ శాఖా మంత్రి కేటీఆర్ ల మధ్య గ్యాప్ ఉందని గతంలో ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. కేసీఆర్ తర్వాత సీఎం రేసులో హరీష్ రావు ఉన్నారని, కానీ, కేటీఆర్ రాకతో ఆయన ఆశలకు గండిపడిందని పుకార్లు వచ్చాయి. ఇక, హరీష్ రావు సొంత కుంపటి కూడా పెట్టబోతున్నారని ఊహాగానాలు వినిపించాయి. ఆ తర్వాత బావాబామ్మర్దులు పలు సందర్భాల్లో తమ మధ్య గ్యాప్ లేదని క్లారిటీనిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా కేటీఆర్ గురించి హరీష్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ముఖ్యమంత్రి కావాలని, అధికారం కావాలని తాను ఏనాడూ అనుకోలేదని హరీష్ రావు అన్నారు. పదవులకంటే వ్యక్తిత్వం గొప్పదని, కేటీఆర్ తనకు మంచి స్నేహితుడని కొనియాడారు. కేటీఆర్ ని ను ముఖ్యమంత్రిగా చేస్తే తనకు అభ్యంతరం ఏమీ లేదని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్‌లో లాగా తమ పార్టీలో పదవుల కోసం కుమ్ములాటలు ఉండవని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్ పార్టీ నేతలది అవగాహనారాహిత్యమని, అందుకే గోబెల్స్ ప్రచారం చేస్తోందని విమర్శించారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వచ్చిన తర్వాత 2 పంటలు వేస్తుంది నిజం కాదా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ కు మంచి పేరు వచ్చిందనే లక్ష కోట్ల అవినీతి అంటూ రాహుల్ గాంధీ అవగాహన లేకుండా మాట్లాడారని ఆరోపించారు. కాంగ్రెస్ కట్టిన ప్రాజెక్టుల్లో ఆ పార్టీ నేతలు కమీషన్లు తీసుకున్నారా అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు వెళ్లిన రాహుల్ జోకర్ అయిపోయారని ఎద్దేవా చేశారు.