పురందేశ్వరి పై విరుచుకుపడ్డ బీజేపీ నేత

ఏపీ బీజేపీ అధ్య‌క్షురాలు ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిపై ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు.. సుదీర్ఘ‌కాలంగా బీజేపీ, ఆర్ ఎస్ ఎస్‌లో ఉన్న నేత ఏవీ సుబ్బారెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. పురందేశ్వ‌రి అధికారం కోసం ఎంత‌కైనా దిగ‌జార‌తార‌ని ఆయ‌న వ్యాఖ్యానించారు. రాష్ట్ర అధ్య‌క్షురాలు అయిన త‌ర్వాత‌.. ఆమె ఎవ‌రినీ ప‌ట్టించుకోవ‌డం లేద‌ని విమ‌ర్శించారు. ఇప్ప‌టికి అనేక సార్లు ఆమెను క‌లిసి పార్టీ ప‌రిస్థితిపై చ‌ర్చించాల‌ని అనుకున్నా.. క‌నీసం అప్పాయింట్‌మెంట్ కూడా ఇవ్వ‌లేద‌ని అన్నారు.

నిజానికి బీజేపీ తొలిసారి ఏపీకి మ‌హిళా అధ్య‌క్షురాలిగా పురందేశ్వ‌రిని నియ‌మించిన నేప‌థ్యంలో తామంతా కూడా..ఆమెను ఘ‌నంగా స‌త్క‌రించామ‌న్నారు. కానీ, ఆమె పార్టీ అధ్య‌క్షురాలు అయిన త‌ర్వాత‌.. పూర్తిగా త‌న వైఖ‌రిని మార్చుకున్నార‌ని.. క‌నీసం పార్టీలో మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న దాడుల‌పై కూడా మాట్లాడ‌డం లేద‌న్నారు. అధికారం కోస‌మే పురందేశ్వ‌రి గ‌తంలో ఎన్టీఆర్‌ను వేధించార‌ని.. టీడీపీని లాక్కునే క్ర‌మంలో ఆమె పాత్ర కూడా ఉంద‌ని ఆరోపించారు.

రాష్ట్ర విభ‌జ‌న‌తో కాంగ్రెస్ ఏపీలో అడ్ర‌స్ లేకుండా పోవ‌డంతో ఇక‌, అక్క‌డ అధికారం ద‌క్క‌ద‌ని భావించి.. త‌న భ‌ర్త‌తో క‌లిసి బీజేపీలో చేరార‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంతో గౌర‌వం ఇచ్చి.. ప‌ద‌వి ఇచ్చిన పార్టీని కూడా కేంద్రంలో అధికారంలోకి రాద‌ని తెలిసిన త‌ర్వాత బీజేపీలో చేరార‌ని విమ‌ర్శించారు. పురందేశ్వ‌రి ని తాము ఘ‌నంగా గౌర‌వించామ‌న్నారు. బీజేపీలో కూడా చిన్న‌మ్మ‌.. చిన్న‌మ్మ అంటూ గౌర‌వించామన్నారు. పురందేశ్వ‌రి ఈ విలువ‌ను నిల‌బెట్టుకోలేద‌ని, బీజేపీలో పురందేశ్వ‌రి వ‌చ్చిన తర్వాతే.. మ‌హిళ‌ల‌కు గౌర‌వం లేకుండా పోయింద‌న్నారు.

జాతీయ పార్టీ బీజేపీలో ఉంటూ.. ఆమె త‌న భ‌ర్త‌ను వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీ చేయించార‌ని ఏవీ సుబ్బా రెడ్డి అన్నారు. వైసీపీలో ఎమ్మెల్యేగా పోటీచేసిన పురందేశ్వ‌రి భ‌ర్త‌కు ప్ర‌త్య‌క్షంగా, ప‌రోక్షంగా ఆమె స‌హ‌క‌రించార‌ని వ్యాఖ్యానించారు.