ప్రశాంత్ కిశోర్ తో కేసీఆర్ కు ఎందుకు చెడిందో బయటకొచ్చింది

ప్రగతి భవన్ లో గంటల కొద్దీ చర్చలు జరిపి.. గులాబీ పార్టీకి ఎన్నికల వ్యూహాల్ని అందించేందుకు సిద్ధమైన ప్రశాంత్ కిశోర్ అలియాస్ పీకే.. ఆ తర్వాతి కొద్దిరోజులకే తెగ తెంపులు చేసుకోవటం తెలిసిందే. ఇంతకూ కేసీఆర్ -ప్రశాంత్ కిశోర్ కు మధ్య ఎందుకు చెడిందన్న విషయాన్ని ఎవరూ బయటపెట్టింది లేదు. అంచనాలు.. ఊహాగానాలు తప్పించి.. గులాబీ బాస్ కు పీకేకు ఎక్కడ చెడిందన్న విషయంపైనా క్లారిటీ లేదు.

తాజాగా ఈ రహస్యాన్ని బయటపెట్టేశారు మంత్రి కేటీఆర్. తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికర విషయాన్ని ప్రపంచానికి వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు.. ప్రశాంత్ కిశోర్ కు మధ్య ఎందుకు చెడిందో మంత్రి కేటీఆర్ మాటల్లో చదివితే విషయం కళ్లకు కట్టినట్లుగా అర్థం కాక మానదు. ఇంతకూ ప్రశాంత్ కిషోర్ కు సీఎం కేసీఆర్ కు మధ్య ఏం జరిగిందన్న విషయాన్ని మంత్రి కేటీఆర్ ఏం చెప్పారన్నది ఆయన మాటల్లోనే చదివితే..

‘‘బాండ్ బారాజ్ మాదిరి మేం వచ్చి నిలుచోవాలి. వారే అన్ని డిసైడ్ చేస్తారు. నిజం చెప్పాలి మీకు. మేం కొద్దికాలం ప్రశాంత్ కిశోర్ తో పని చేశాం. ఇప్పుడు లేడు. చాలాకాలమైంది ఆయన పోయి. ప్రభుత్వాన్ని ఏం చేయాలి. ఎలా నడిపించాలో కూడా మేమే చెబుతామని చెబుతారు వాళ్లు. ఏం ప్రోగ్రాం చేయాలో వారే చెబుతారు. అలాంటప్పుడు మనమందరం ఎందుకు ఇక్కడ? ప్రజల చేత గెలిచిన వారు మా తెలివితో పాలన చేయాలి. ప్రజలు ఎదుర్కొన్న ప్రభుత్వం.. పాలకులు వారే నడపాలి. ప్రజలకు.. పాలకుల మధ్యలో మరొకరు ఉండకూడదు. ప్రజా ప్రతినిధులనే మాటకు అర్థం ప్రజా ఆకాంక్షలకు మేం కదా చేయాలి. మమ్మల్ని అందుకే గెలిపించారు కదా’ అంటూ చెప్పటం గమనార్హం.

ఎన్నికల వ్యూహకర్తల వల్ల ఒక్క లాభం ఉందన్న కేటీఆర్.. అధికారంలో ఉన్నప్పుడు ఎవరికి వారు గొప్పగా చెప్పేస్తారని.. విపరీతంగా పొగిడేస్తారని.. ఇంద్రుడు.. చంద్రుడు.. మీరు దైవాంశ సంభూతలని చెప్పేటోళ్లే ఎక్కువగా ఉంటారు. మీరే తప్పు చేయట్లేదు.. మీరు ఎలాంటి పొరపాట్లు చేయట్లేదని చెబుతారు. ఎన్నికల వ్యూహకర్తలు ఉంటే మిర్రర్ మాదిరి చెబుతుంటారు’ అని వ్యాఖ్యానించారు. దీనికి బదులుగా ఇంటర్వ్యూ చేసినోళ్లు మాత్రం.. మీరు చెప్పనిస్తే కదా? అని ప్రశ్నించగా.. ‘‘మీరు చెబుతారు కదా?’’ అని కేటీఆర్ బదులిచ్చారు. ఇంటర్వ్యూ చేసే మీడియా ప్రముఖుడు బదులిస్తూ.. మమ్మల్ని తిడతారు కదా? అంటూ సెటైర్ వేయటం గమనార్హం. మేం తిట్టినా చదువుతాం కదా? అన్న మాట మంత్రి కేటీఆర్ నోటి నుంచి రావటం విశేషం.