బీఆర్ఎస్ నేత గువ్వల బాలరాజుపై దాడి ఘటన సంచలనం రేపిన తెలిసిందే. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఘర్షణ జరగడంతో ఆ గొడవలో బాలరాజుతోపాటు పలువురు బిఆర్ఎస్ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్ అపోలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన బాలరాజు మీడియాతో మాట్లాడారు.
ఈ క్రమంలోనే కాంగ్రెస్ నేతలపై ఆయన సంచలన ఆరోపణలు చేశారు. తన తల్లిదండ్రుల మీద ఒట్టేసి చెబుతున్నానని, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన అనుచరులు రాళ్లతో తనపై దాడి చేశారని సంచలన ఆరోపణలు చేశారు.
ఆయన మీద, ఆయన అనుచరుల మీద చర్యలు తీసుకోవాలని పోలీసులను బాలరాజు కోరారు. గతంలో తన ఆఫీసు మీద కూడా వంశీకృష్ణ దాడి చేశారని ఆరోపించారు. మొన్న కొత్త ప్రభాకర్ రెడ్డిపై, ఈరోజు తనపై దాడి చేశారని, తెలంగాణలో మునుపెన్నడూ లేని కొత్త ఆనవాయితీని తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన అనుచరులను కూడా బెదిరిస్తున్నారని ఆరోపించారు. అయితే, తన అనుచరులు, కార్యకర్తలు తొందరపడవద్దని, సంయమనం పాటించాలని బాలరాజు విజ్ఞప్తి చేశారు.
ప్రజాక్షేత్రంలో తేల్చుకుందామని, కాంగ్రెస్ కు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ప్రజాసేవ కోసం పగ, ప్రతీకారాలు లేకుండా పనిచేస్తున్నానని, ఇది పిరికితనంతో చేసిన దాడి అని బాలరాజు అన్నారు. తనను రాజకీయంగా ఎదుర్కోలేక ఇలా అంతమొందించే కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు.