బీఆర్ ఎస్ ఎమ్మెల్యే, నాగర్ కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట నియోజవకర్గంఅధికార పార్టీ అభ్యర్థి గువ్వల బాలరాజుపై జరిగిన రాళ్ల దాడి ఘటనను మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆసుపత్రిలో చికిత్సపొందుతున్న బాలరాజును ఆయన పరామర్శించారు. అనంతరం.. మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. మేమే మళ్లీ అధికారంలోకి వస్తాం. అప్పుడు మీ అంతు చూస్తాం.. ఇంత కింత తప్పదు అని హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీపై ప్రతీకారం తీర్చుకుంటామని కూడా కుండబద్దలు కొట్టారు కేటీఆర్. బాలరాజు కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని చెప్పారు. బీఆర్ఎస్ కు వస్తున్న ప్రజాదరణ ఓర్వలేకే తమపై దాడులకు తెగబడుతున్నారని ఆరోపించారు. “ఉద్యమ కాలంలో ఎన్నో దాడుల్ని తట్టుకుని బాలరాజు నిలబడ్డారు. ఆయన ఆరోగ్యంపై ఎవరూ ఆందోళన చెందవద్దు. ప్రజాప్రతినిధులకు సెక్యూరిటీ పెంచాలని డీజీపీని కోరుతాం. అచ్చంపేట కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ తన అనుచరులతో ఆయనపై దాడి చేశారు. ఇంతకింత తీర్చుకుంటాం“ అని కేటీఆర్ మరోసారి హెచ్చరించారు.
రాష్ట్రంలో దాడుల సంస్కృతి మంచిదికాదని కాంగ్రెస్ నేతలకు హితవు పలికారు. బాలరాజు సతీమణి అమలను కూడా కించపరిచేలా కాంగ్రెస్ నేతలు వ్యవహరిస్తున్నారని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చేది మా ప్రభుత్వమే. దాడులకు పాల్పడిన వారిపై రివేంజ్ తీర్చుకుంటాం. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పాలి. దళితబిడ్డపై కాంగ్రెస్ దాడులు చేస్తే.. ఆ పార్టీ అణగారిన వర్గాలకు ఇస్తున్న గౌరవమేంటి? దళితులకు మేం బంధువులగా ఉంటే.. వారు శతృవులుగా వ్యవహరిస్తున్నారు అని కేటీఆర్ నిప్పులు చెరిగారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates