ఏపీలో రాష్ట్రపతి పాలన పెట్టాలని టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి, సత్తెనపల్లి ఇంచార్జ్ కన్నా లక్ష్మీనా రాయణ డిమాండ్ చేశారు. నిన్నెందుకు నమ్మాలి జగన్ అంటూ.. ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా మీడియాతో మాట్లాడిన కన్నా.. సీఎం జగన్‌పై విమర్శల వర్షం కురిపించారు. అధికారం ఉంటే రాష్ట్రాన్ని ఎలా దోచేయవచ్చొ జగన్ నిరూపించారని మండిపడ్డారు.
16 నెలల పాటు జైల్లో ఉండి ఎలా దోచుకోవచ్చో రీసెర్చి చేశారని దుయ్యబట్టారు. ఏపీని జగన్ సర్వనాశనం చేశారని మండిపడ్డారు. ఏపీకి జగన్ ఎందుకు అవసరం లేదో వంద కారణాలు చెబుతామని.. వంద కారణాలతో పుస్తకం వేస్తామని తెలిపారు. పోలవరం కట్టలేదని, రాజధాని లేకుండా చేశారని విరుచుకుపడ్డారు. ఒకసారి అవకాశం ఇస్తే ఏపీని తెలంగాణకు తాకట్టు పెట్టారని కన్నా వ్యాఖ్యానించారు.
మరోసారి అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని జగన్ బ్రిటీష్ వాడికి అమ్మేస్తారని కన్నా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నాసిరకం సారా అమ్ముకుంటూ తాగుబోతులను పెంచారన్నారు. దళితులకు జగన్ చేసినంత ద్రోహం ఇంకే ముఖ్యమంత్రి చేయలేదని దుయ్యబట్టారు. విశాఖలో భూములు కొట్టేయడానికే కొత్త అసైన్మెంట్ చట్టం చేశారన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను భయపెట్టి బానిసలుగా చేస్తున్నారని.. మీడియా సమావేశం పెడితే పోలీసులను కాపలా పెట్టారని కన్నా వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేశారు. ఈ రాష్ట్రంలో స్వేచ్ఛగా బతకాలన్నా రాష్ట్రపతి పాలన కావాలన్నారు. త్వరలోనే తాము ఈ రాష్ట్రానికి జగన్ ఎందుకు వద్దో.. ప్రజలకు వివరిస్తామని కన్నా వ్యాఖ్యానించారు. జగన్ పాలనపై బుక్‌లెట్ వేస్తామని చెప్పారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates