టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో రూ. 341 కోట్ల మేరకు అవినీతి చేశారంటూ.. అరెస్టు చేయడం.. అనంతరం ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉంచడం తెలిసిందే. అయితే.. దీనికి సంబంధించి బెయిల్ కోరుతూ.. చంద్రబాబు రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించారు. ఇప్పటికే రెండు విడతలు విచారణ జరిగింది. తనపై అక్రమ కేసు పెట్టారని చంద్రబాబు తరఫున న్యాయవాది వాదనలు వినిపించారు.
సీనియర్ రాజకీయ నాయకుడు, పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి అన్న అంశాలను పరిగణనలోకి తీసుకుని చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని గతంలో జరిగిన వాదనల్లో బాబు తరఫున న్యాయ వాది వాదించారు. అదేసమయంలో ఆయన అనారోగ్య సమస్యలను కూడా కోర్టుకు వివరించారు. ఇక, ఈ విషయంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాల్సింది. దీనికి గాను పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేశారు.
తాజాగా ఈ పిటిషన్ విచారణకు రాగా.. ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించాల్సిన అదనపు అడ్వొకేట్ జనరల్ పొన్నవోలు సుధాకర్‌రెడ్డి కోర్టుకు హాజరుకాలేదు. అనారోగ్య సమస్యలు తలెత్తడంతో పొన్నవోలు హాజరు కాలేక పోయారని.. ఈ నేపథ్యంలో ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించేందుకు మరికొంత గడువు కావాలని.. ఆయన తరఫున న్యాయవాది అభ్యర్థించారు. దీంతో చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై ప్రభుత్వ వాదనల కోసం.. ఈ నెల 15 వరకు విచారణ వాయిదా వేస్తూ.. హైకోర్టు తీర్పు ఇచ్చింది.
ఇదిలావుంటే.. ప్రస్తుతం అనారోగ్య సమస్యలతో, కంటికి ఆపరేషన్ నిమిత్తం చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులోనే హైకోర్టు ఆయనకు నాలుగు వారాల పాటు.. మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇటీవల చంద్రబాబు కుడి కంటికి శుక్లాల ఆపరేషన్ చేసిన విషయం తెలిసిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates