ఏపీ డిప్యూటీ సీఎం మౌనం.. ఇప్పుడు హాట్ టాపిక్ ఎందుకు?

ఏపీ డిప్యూటీ ముఖ్యమంత్రి మౌనం ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. అనూహ్యంగా ఏపీ ఉప ముఖ్యమంత్రిగా అవకాశాన్ని సొంతం చేసుకున్న పుష్ప శ్రీవాణి.. చాలా చిన్న వయసులోనే పెద్ద పదవిని సొంతం చేసుకున్నారని చెప్పాలి. సీఎం జగన్మోహన్ రెడ్డి తన మీద పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఉండేందుకు ఆమె తీవ్రంగా ప్రయత్నిస్తుండేవారు.

ముఖ్యమంత్రి మీదా.. ప్రభుత్వం మీద ఎవరు పల్లెత్తు మాట అన్నా కస్సుమనేవారు. తీవ్రస్థాయిలో విరుచుకుపడేవారు. దీంతో.. ఆమెకు ఫైర్ బ్రాండ్ ఇమేజ్ తొందరగానే వచ్చేసింది.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ఆమె చేసే టిక్ టాక్ లు బాగా పాపులర్ కావటమే కాదు.. రాష్ట్రానికి అతీతంగా తెలుగు వారందరికి సుపరిచితురాలిగా మారారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లాలో సీనియర్ నేత బొత్సకు సరిసమానంగా ఇమేజ్ ను సొంతం చేసుకోగలిగారు. తన దూకుడుతో చాలా తక్కువ కాలంలోనే.. ఆమె పాపులర్ కాగలిగారు.

మాటలతో తరచూ వార్తల్లోకి ఎక్కటమే కాదు.. ఆమెకంటూ గుర్తింపును సొంతం చేసుకోవటంలో సక్సెస్ అయ్యారు. అలాంటి ఆమె.. గడిచిన కొన్ని వారాలుగా మౌనంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. గతంలో మాదిరి ఉత్సాహంగా వ్యవహరించటం లేదు. ప్రభుత్వం మీదా.. ప్రభుత్వాధినేత మీద విమర్శలు.. ఆరోపణలు చేసినా తనకు సంబంధం లేదన్నట్లుగా ఉంటున్నారు.

టిక్ టాక్ బ్యాన్ కావటంతో కొత్త వీడియోల్ని వేరే అప్లికేషన్ల మీద అప్ లోడ్ చేయటం లేదు. మొత్తంగా తన తీరుకు భిన్నంగా వ్యవహరిస్తున్న ఆమె వైఖరి ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. డిప్యూటీ సీఎం ఎందుకింత మౌనంగా ఉంటున్నారు? ఆమె సైలెంట్ గా ఉండటం వెనుకున్న అసలు కారణం ఏమిటి? అన్న ప్రశ్నలు పలువురి నోట వినిపిస్తున్నాయి. ఇంతకీ.. ఏపీ డిప్యూటీ సీఎం మేడమ్.. తన తీరును ఎందుకు మార్చుకున్నారంటారు?