చంద్రబాబుకు సుప్రీంలో దక్కని ఊరట

స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు డిస్మిస్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ చంద్రబాబు తరఫు న్యాయవాదులు దేశపు అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును గతంలో ఆశ్రయించారు. అయితే, ఆ క్వాష్ పిటిషన్ కొట్టివేత వ్యవహారంపై వాదోపవాదాలు పూర్తయిన నేపథ్యంలో సుప్రీం కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. ఈ రోజు తీర్పు వెలువడుతుందని టిడిపి నేతలు ఎదురు చూశారు. అయితే, అనూహ్యంగా ఆ తీర్పును సుప్రీంకోర్టు మరోసారి వాయిదా వేసింది. దీపావళి సెలవుల తర్వాత తీర్పు వెల్లడిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది.

ఈ నెల 10వ తేదీ నుంచి 19వ తేదీ వరకు సుప్రీంకోర్టుకు దీపావళి సెలవులు. 20వ తేదీన కోర్టు మళ్లీ ప్రారంభం అవుతుంది. మరోవైపు, ఈ నెల 23 లోగా తీర్పు వెలువడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరోవైపు, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణను ఈ నెల 30వ తేదీకి సుప్రీంకోర్టు వాయిదా వేసింది. అప్పటివరకు చంద్రబాబును అరెస్ట్ చేయవద్దని సిఐడి అధికారులను ఆదేశించింది. ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిని హైకోర్టు తిరస్కరించింది. ఈ క్రమంలోనే హైకోర్టు తీర్పును చంద్రబాబు సుప్రీంకోర్టులో సవాల్ చేశారు.

వాస్తవానికి ఫైబర్ నెట్ కేసు ముందస్తు బెయిల్ విచారణను ముందుగా ఈ నెల 23కే వాయిదా వేశారు. కానీ, ఆ లోపే స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కూడా తీర్పు వచ్చే అవకాశముంది. దాంతోపాటు, తన కుమారుడి వివాహం కారణంగా విచారణ వాయిదా వేయమని చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్రా సుప్రీం కోర్టు ధర్మాసనాన్ని కోరారు. దీంతో, 23వ తేదీకి బదులు నవంబర్ 30కి ఈ కేసు విచారణను సుప్రీం కోర్టు వాయిదా వేసింది.