తెలంగాణలో కీలకమైన నియోజకవర్గం, అన్ని వర్గాల ప్రజలు ఎక్కువగా ఉన్న నియోజకవర్గం ఖైరతాబాద్. ఈ నియోజకవర్గం ఒకరకంగా.. పెద్దదనే చెప్పాలి. 13 మండలాలు.. వీటిలో 8 మాస్ ఏరియాలు ఉన్నాయి. ఇక్కడ ప్రజలతో జై కొట్టించుకోవాలంటే మాస్ రాజకీయలు కావాలి. ఇక, ఇప్పుడు కాంగ్రెస్ తరఫున మాజీ నేత, దివంగత పబ్బతి రెడ్డి జనార్దన్‌రెడ్డి కుమార్తె పబ్బతిరెడ్డి విజయ పోటీ చేస్తున్నారు. ఆమె ఇప్పటికి రెండు మూడు పార్టీలు మారిన విషయం తెలిసిందే.
అయితే.. విజయ సోదరుడు.. 2008 బై పోల్‌లో ఖైరతాబాద్ నుంచి విజయం దక్కించుకున్న పబ్బతిరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి ఇక్కడ పట్టు సాధించారు. దీంతో అన్నగారి దిశానిర్దేశం.. ఆయన అనుచరగణం తనకు మేలు చేస్తాయనే ఉద్దేశం విజయకు ఉంది. నిన్న మొన్నటి వరకు ఇది కరెక్టే! కానీ.. జూబ్లీహిల్స్ నియోజకవర్గం టికెట్‌ను కాంగ్రెస్ విష్ణుకు కాకుండా వేరేవారికి కేటాయించడంతో ఆయన కాంగ్రస్‌పై నిప్పులు చెరుగుతున్నారు.
అంతేకాదు.. బీఆర్ ఎస్ అధినేత కేసీఆర్‌కు టచ్‌లోకి కూడా వెళ్లిపోయారు. ఈ నేపథ్యంలో ఖైరతాబాద్‌లో చెల్లి తరఫున ఆయన ప్రచారం చేసే అవకాశం లేదు. పోనీ.. లోపాయికారీగా అయినా.. తన అనుచర గణాన్ని.. లేదా తన మద్దతుగా దారులుగా ఉన్నవారిని ఖైరతాబాద్‌కు పంపించే అవకాశం కూడా లేదు. అంతేకాదు. కాంగ్రెస్‌ను ఓడిస్తానని చెబుతున్న ఆయన చెల్లెలి కోసం.. త్యాగం చేసే పరిస్థితి కూడా కనిపించడం లేదు.
అంటే.. ఒక రకంగా.. అన్నకు టికెట్ ఇవ్వని పాపం.. ఇప్పుడు చెల్లికి చుట్టుకుంటోంది. క్షేత్రస్థాయిలో విష్ణు వర్గంగా ఉన్నవారు.. విజయకు దూరంగా ఉంటున్నారు. ఆమె పిలిచినా.. వస్తామని అంటున్నారు తప్ప.. ఎవరూ ముందుకు రావడం లేదు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండడం.. మరోవైపు తన అనుకున్న అన్న కాంగ్రెస్‌పై తిరుగుబాటు బావుటా ఎగరేయడంతో చెల్లెలు కుమిలిపోతోంది. కనీసం ఈ సారైనా విజయం దక్కించుకోకపోతే.. ఇక, ఎప్పటికీ ఇంతే అనే ఆవేదన ఆమె అనుచరల్లో స్పష్టంగా కనిపిస్తోంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates