టార్గెట్ కాంగ్రెస్‌: తెలంగాణ‌పై కేంద్రం పంజా.. ఎవ‌రికి న‌ష్టం?!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ నేత‌ల ఇళ్ల‌పై ముఖ్యంగా ఆ పార్టీ త‌ర‌ఫున పోటీచేస్తున్న అగ్ర‌నేత‌ల ఇళ్ల‌పై ఐటీ దాడులు సంచ‌ల‌నంగా మారాయి. తాజాగా మాజీ ఎంపీ, కాంగ్రెస్ పాలేరు అభ్యర్థి పొంగులేటి శ్రీనివాసరెడ్డి నివాసం, కార్యాలయాలపై ఐటీ సోదాలు నిర్వహించింది. ఖమ్మం, హైదరాబాద్‌‌లోని పొంగులేటి నివాసం, కార్యాలయాల్లో దాడులు జరుగుతున్నాయి.

దీనికి ముందు.. ఖ‌మ్మం అభ్య‌ర్థి, ఇటీవలే బీఆర్ ఎస్‌ను వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న మాజీ మంత్రి తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు కార్యాల‌య‌పై కూడా ఐటీ శాఖ దాడులు చేసింది. ఈ ప‌రిణామంతో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్ర‌భుత్వం కాంగ్రెస్‌ను టార్గెట్ చేసింద‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, ఈ ప‌రిణామంపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఫైర‌య్యారు.

“నేడు పొంగులేటి, నిన్న తుమ్మల, అంతకు ముందు పలువురు కాంగ్రెస్ నేతల ఇళ్లపై ఐటీ దాడులు దేనికి సంకేతం!? బీజేపీ, బీఆర్ఎస్ నేతల ఇళ్లపై ఐటీ రైడ్స్ ఎందుకు జరగడం లేదు!? రాష్ట్రంలో కాంగ్రెస్ సునామీ రాబోతోందని స్పష్టమైన సమాచారం రావడంతో మోడీ – కేడీ(కేసీఆర్‌) బెంబేలెత్తుతున్నారు. ఆ సునామీని ఆపడానికి చేస్తోన్న కుతంత్రం ఇది. ఈ దాడులను తీవ్రంగా ఖండిస్తున్నాను. నవంబర్ 30న కాంగ్రెస్ సునామీలో కమలం, కారు గల్లంతవడం ఖాయం” అని వ్యాఖ్యానించారు.

ఎవ‌రికి న‌ష్టం?

ఎన్నిక‌ల వేళ ఐటీ దాడులు జ‌ర‌గడం.. దేశంలో గ‌త ఐదేళ్లుగా జ‌రుగుతూనే ఉంది. గ‌తంలో త‌మిళ‌నాడు ఎన్నిక‌ల స‌మ‌యంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకున్న డీఎంకే(ప్ర‌స్తుతం అధికారంలో ఉంది) నేత‌ల ఇళ్ల‌పైనా ఐటీ దాడులు జ‌రిగాయి. అదేవిధంగా కాంగ్రెస్ నేత‌ల ఇళ్ల‌ను కూడా వ‌దిలి పెట్ట‌లేదు. అయినాప్ప‌టికీ.. అక్క‌డ అధికారం డీఎంకేకే ద‌క్కింది.

ఇక‌, ఈ ఏడాది మేలో జ‌రిగిన క‌ర్ణాట‌క ఎన్నిక‌ల స‌మ‌యంలోనూ.. ఐటీ విజృంభించింది. కాంగ్రెస్ నేత‌లు.. డీకే శివ‌కుమార్ స‌హా మ‌ల్లికార్జున ఖ‌ర్గే కుమారుడు ప్రియాంక్ ఖ‌ర్గే నివాసాల‌పైనా దాడులు చేసింది. ఈ విష‌యాలు అప్ప‌టి ఎన్నిక‌ల్లో ప్ర‌చార అస్త్రాలుగా కాంగ్రెస్ మార్చుకుంది. ప‌లితంగా బీజేపీ అధికారానికి దూర‌మైంది. మ‌రి తెలంగాణ‌లో జ‌రుగుతున్న దాడుల‌తో బీఆర్ ఎస్‌-బీజేపీ ఒక్క‌టేన‌ని ప్ర‌చారం చేస్తున్న నేప‌థ్యంలో బీజేపీ కంటే కూడా బీఆర్ ఎస్‌పై ప్ర‌భావం ప‌డుతుంద‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు.