ఏపీ సీఐడీ.. ఇటీవల కాలంలో తరచుగా మీడియాలో ఉంటున్న పోలీసు విభాగం. మాజీ సీఎం చంద్రబాబు అరెస్టు దరిమిలా.. ఏపీ సీఐడీ చర్యలు దేశవ్యాప్తంగా చర్చకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా ఏపీ సీఐడీ సంచలన ప్రకటన చేసింది. సీఎం జగన్‌పై ఈగవాలినా ఊరుకునేది లేదని స్పష్టం చేసింది. అంతేకాదు.. ఎవరైనా సాహసించి ఆయనపై పోస్టులు పెట్టినా.. వ్యాఖ్యలు చేసినా వారి ఆస్తులను స్వాధీనం చేసుకుని కేసులు పెడతామని కూడా హెచ్చరించడం సంచలనం సృష్టిస్తోంది.
తాజాగా మీడియాతో మాట్లాడిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్.. సీఎం జగన్ సహా ఆయన కుటుంబ సభ్యులపై అసభ్య పోస్టులు పెట్టే వారి ఆస్తులను అటాచ్ చేస్తామని తీవ్రంగా హెచ్చరించారు. అంతేకాదు, సోషల్ మీడియా పోస్టులపై నిఘా పెట్టామని, ఎవరైనా అసభ్య పోస్టులు పెడితే.. వారిని గుర్తించి త్వరలోనే చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే కొన్ని సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించామని.. నిందితుల ఆస్తులు కూడా అటాచ్ చేసే దిశగా చర్యలు ఉంటాయని చెప్పారు.
ప్రతిపక్ష నేతలపై సోషల్ మీడియాలో వస్తున్న పోస్టులపైనా కూడా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు. అదేవిధంగా న్యాయ వ్యవస్థను కించపరిచేలా పోస్టులు పెట్టిన వారిపై కూడా చర్యలు ఉంటాయని తెలిపారు. సీఎం జగన్, కుటుంబ సభ్యులపై పోస్టులు పెడుతున్న వారిలో టీడీపీ నేత కార్తీక్‌రెడ్డి, సమరసింహారెడ్డి, చిత్రలహరి, వైసీపీ మొగుడు అకౌంట్స్ గుర్తించామని పేర్కొన్నారు. విదేశాల నుంచి పెట్టే పోస్టుల విషయంలో ఎంబసీతో మాట్లాడి చర్యలు తీసుకుంటామన్నారు.
202 సోషల్ మీడియా అకౌంట్స్‌ను మానిటరింగ్ చేస్తున్నామని సీఐడీ చీఫ్ చెప్పుకొచ్చారు. 2 నెలల్లో కొత్తగా 31 కొత్త సోషల్ మీడియా అకౌంట్స్ గుర్తించామన్నారు. అసభ్య పోస్టులను షేర్, లైక్ చేస్తున్న వారిపై 2,972 సైబర్ బుల్లయింగ్ షీట్స్ ఓపెన్ చేసినట్లు సంజయ్ వెల్లడించారు.
చట్టం ఏం చెబుతోంది?
సరే.. సంజయ్ చెప్పుకొచ్చారు బాగానే ఉంది. కానీ, ఐటీ చట్టం ప్రకారం ఇవి చెల్లుబాటు అవుతాయా? అనేది ప్రశ్న. గతంలో ప్రధాన మంత్రికి వ్యతిరేకంగా వచ్చిన పోస్టును ఫార్వార్డ్ చేసిన ఇద్దరు విద్యార్థినులను కర్ణాటక పోలీసులు అరెస్టు చేశారు. దీనిపై సుప్రీంకోర్టులో నిందితులు పిటిషన్ వేయగా.. విచారించిన సుప్రీం కోర్టు.. ఐటీ చట్టంలోని కొన్ని సెక్షన్లను తొలగించాలని.. భావప్రకటనకు విరుద్ధంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. ట్రోల్స్, మీమ్స్ వంటివి భావ ప్రకటనలోకే వస్తాయని తేల్చి చెప్పింది. అంతేకాదు.. ప్రజాజీవితంలో ఉన్నవారు అన్నింటికీ సిద్ధమయ్యే ఉండాలని తేల్చి చెప్పింది. మరి ఇప్పుడు సీఐడీ వాదన ఎంత వరకు న్యాయవ్యవస్థలో నిలబడుతుందో చూడాలి.