న‌న్ను తిట్టిన వారు ఏమ‌య్యారో తెలుసుగా: మోడీ

“తెలంగాణ ఎన్నిక‌ల్లో న‌న్ను తిడుతున్నారు. కానీ, న‌న్ను తిట్టిన వారు ఏమ‌య్యారో తెలుసుగా. న‌న్ను తిట్టిన నాయ‌కులు.. ప్ర‌జ‌ల మ‌ధ్య లేరు. ప్ర‌జ‌ల ఓట్లు కూడా వారికి ప‌డ‌వు. క‌నీసం అధికారంలోకి వ‌చ్చేందుకు క‌నీస దూరంలో కూడా లేరు” అని ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. తెలంగాణ అసెంబ్లీఎన్నిక ల‌నేప‌థ్యంలో బీజేపీ అభ్య‌ర్థుల త‌ర‌ఫున ఆయ‌న ఈ రోజు తొలిసారి ప్ర‌చారానికి వ‌చ్చారు. ఎల్బీ స్టేడియంలో నిర్వ‌హించిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా అటు కాంగ్రెస్‌, ఇటు బీఆర్ ఎస్‌పై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పించారు.

తుఫాన్ ఖాయం
ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో బీజేపీ తుఫాన్ వ‌స్తుంద‌ని ప్ర‌ధాని మోడీ జోస్యం చెప్పారు. తెలంగాణ స‌మాజం అభివృద్ధిని కోరుకుంటోంద‌ని.. అది తాము చేస్తున్నామ‌ని గిరిజ‌న యూనివ‌ర్సిటీ స‌హా అనేక ప‌థ‌కాలు ఇక్క‌డ అమ‌లు చేస్తున్నామ‌న్నారు. ర‌హ‌దారుల విస్త‌ర‌ణ కూడా తమ హ‌యాంలోనే జ‌రిగింద‌న్నారు. కుటుంబ పార్టీల‌కు కాంగ్రెస్‌, బీఆర్ ఎస్‌లు కేరాఫ్ అని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. కాంగ్రెస్‌ పార్టీకి బీఆర్‌ఎస్ బీ టీంగా అభివ‌ర్ణించారు. బీఆర్ ఎస్‌, కాంగ్రెస్ ల డీఎన్ ఏ ఒక్కటేన‌న్నారు. అవినీతి, కుటుంబపాలన, బుజ్జగింపు రాజకీయాలు వారి లక్షణాలని విమ‌ర్శించారు.

బీసీల ఆకాంక్షలను పట్టించుకునేది బీజేపీ మాత్రమేన‌ని మోడీ చెప్పారు. బీసీలకు ఎక్కువ టికెట్లు ఇచ్చామ‌ని తెలిపారు. జనాన్ని దోచుకున్న వారు.. ఆ మొత్తాన్ని తిరిగి ఇచ్చేయాల్సిదేన‌ని, రాష్ట్రాన్ని దోచుకోవాలన్నదే బీఆర్ ఎస్‌, కాంగ్రెస్‌ లక్ష్యంమ‌ని దుయ్య‌బ‌ట్టారు. “వారి పిల్లలకు దోచిపెట్టడమే వాళ్ల పని. మీ పిల్లల భవిష్యత్‌ వారికి ఏ మాత్రం పట్టదు. ఒక తరం భవిష్యత్‌ను బీఆర్ ఎస్ నాశనం చేసింది. అబ్దుల్‌ కలామ్‌ను వాజ్‌పేయీ రాష్ట్రపతిని చేశారు. పీఏ సంగ్మా, బాలయోగిని స్పీకర్‌ చేసింది బీజేపీనే. రామ్‌నాథ్‌ కోవింద్‌ను రాష్ట్రపతిని చేసింది బీజేపీనే. గిరిజన మహిళ ద్రౌపతి ముర్మును రాష్ట్రపతిని చేసింది బీజేపీనే. ఓబీసీని అయిన నన్ను ప్రధానిని చేసింది బీజేపీనే. మెడికల్‌, డెంటల్‌ కాలేజీల్లో బీసీలకు 27శాతం రిజర్వేషన్‌ కల్పించాం.” అని మోడీ వివ‌రించారు.