ఆమె గళం విప్పితే.. నిప్పులు కురవాల్సిందే. మైకులు దద్దరిల్లాల్సిందే! ప్రత్యర్థులపై తన మాటల తూటాలతో విరుచుకుపడడంలో తనకు తానే సాటి అని పేరొందిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి. పార్టీ పరిస్థితితో సంబంధం లేకుండా.. వ్యక్తిగత రాజకీయాలు చేయడంలో దిట్టగా పేరు సంపాయించుకున్న రేణుకా చౌదరి ఊసు ప్రస్తుతం ఎక్కడా వినిపించడం లేదు.
నిజానికి కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గెలుపు గుర్రం ఎక్కాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నేపథ్యం లో అందివచ్చిన ప్రతి అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతోంది. అయితే.. ఈ క్రమంలో ఫైర్ బ్రాండ్స్‌కే ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రేణుకా చౌదరిని మాత్రం పార్టీ ఎక్కడా పట్టించుకోకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఖమ్మం జిల్లాకు చెందిన రేణుకా చౌదరి గతంలో ఎంపీగా విజయం దక్కించుకున్నారు. తర్వాత కూడా కాంగ్రెస్ ఆమెను ఆదరించింది.
అయితే. తాజా ఎన్నికల్లో ఆమె తన వర్గానికి టికెట్లు కేటాయించాలని పట్టుబట్టారు. ఈ విషయంలో ఇటు రాష్ట్ర నేతలు, అటు అధిష్టానంలోని పెద్దలతోనూ రేణుక చర్చించారు. కానీ, ఎక్కడో తేడా కొట్టింది. దీంతో కొన్ని రోజులు తన వారికి ఎందుకు టికెట్లు ఇవ్వరు? అంటూ.. ఆగ్రహం వ్యక్తం చేసినా.. తర్వాత.. మెత్తబడ్డారు. కేవలం జిల్లాలోని ఒకటి రెండు నియోజకవర్గాల్లోనే రేణుక ప్రచారం కనిపిస్తోంది. ముఖ్యంగా కీలక నేతలతో ఆమెకు ఉన్న విభేదాలు అలానే కొనసాగుతున్నాయి.
ఇక, పార్టీపరంగా ఆమెకు ఏమాత్రం పిలుపు వచ్చినా.. వచ్చి ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసేందుకు ఆమె ప్రయత్నిస్తున్నారు. కానీ, ఆమెను పిలిచేవారు లేరు. దీంతో రేణుకా చౌదరి రాజకీయానికి ఊపు రావడం లేదనే టాక్ వినిపిస్తోంది. మొత్తానికి ఫైర్ బ్రాండ్ కు ఎన్ని తిప్పలో అంటున్నారు ఆమె అనుచరులు. ముక్కు సూటి తనం.. ఉన్నది మొహాన మాట్లాడేయడం.. దూకుడు.. కరకు వ్యవహారం వంటివి రేణుకకు మైనస్‌గా మారాయనే చర్చ ఉన్న విషయం తెలిసిందే.