“ఇంతింతై.. వటుడింతై.. అని పోతన్నగారు చెప్పినట్టు మనం, మన పార్టీ ఎదుగతమే తప్ప.. దిగజారుడు లేనేలేదు. దద్దమ్మలను మనల్నను ఏమార్చేందుకు కట్టుకథలు అల్లుతారు. వాటిని నమ్మకుర్రి. మనం, మన పార్టీ మధ్యాహ్నపు సూరీడి లెక్క ప్రభంజనంగా మెరుస్తున్నాం”- 2018 ఎన్నికల సమయంలో బీఆర్ ఎస్ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ఇవి. ఎక్కడికి వెళ్లినా.. ఆయన ఈ వ్యాఖ్యలే చెప్పుకొచ్చారు.
దీనికి కారణం.. 2014 ఎన్నికల సమయంలో “మీకు ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుంది” అన్న సర్వే సంస్థల ప్రశ్నకు తెలంగాణ సమాజం సగానికి పైగా ముక్తకంఠంతో కేసీఆర్‌ను కోరుకుంది. అప్పటి లెక్కల ప్రకారం 65-62 శాతం మంది ప్రజలు సీఎంగా కేసీఆర్‌నే కోరుకున్నారు. ఇది అప్పటి ఎన్నికల్లో కేసీఆర్‌ను సీఎంగా నిలబెట్టింది. వాస్తవానికి సీట్ల రాశిలో బొటాబొటిగానే ప్రజలు మార్కులు వేసినా.. అధికారం మాత్రం దక్కించుకుని తెలంగాణ తెచ్చిన నాయకుడిగా రికార్డు సృష్టించారు.
కట్‌చేస్తే.. 2018 ఎన్నికలు. అప్పటికి నాలుగున్నరేళ్లపాటు తెలంగాణ సమాజాన్ని పాలించారు కేసీఆర్. ఆ ఎన్నికల సమయంలోనూ సేమ్ క్వశ్చన్. దీనికి అప్పటి ప్రజలు.. 53-51 శాతం మంది మాత్రమే కేసీఆర్‌ను సీఎం అభ్యర్థిగా కోరుకుంటున్నట్టు మెజారిటీ సర్వే సంస్థలు వెల్లడించాయి. చివరకు ఎన్నికలు ముగిసే నాటికి కావాల్సిన మేజిక్ ఫిగర్ కన్నా.. ఎక్కువగానే సీట్లు కైవసం చేసుకుని కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు. కానీ, 2014 నాటికి, 2018 నాటికి కేసీఆర్‌ను కోరుకుంటున్న వారి సంఖ్య తగ్గిపోయింది.
ఇక, ఇప్పుడు జరుగుతున్న కీలక అసెంబ్లీ ఎన్నికల విషయానికి వస్తే.. రెండు ప్రధాన ఎన్నికల సర్వేలు.. మీకు ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే బాగుంటుందని తెలంగాణ సమాజాన్ని ప్రశ్నించినట్టు.. కేవలం 38-36 శాతం మంది మాత్రమే కేసీఆర్‌కు జై కొట్టారు. ఈ పరిణామం ఇప్పుడు కలకలం రేపుతోంది. గత పదేళ్లుగా తెలంగాణ లో అధికారంలో ఉన్న కేసీఆర్.. దేశం గర్విచదగ్గ పథకాలు తెచ్చామని చెబుతున్నా.. దళిత బంధు వంటి కీలక పథకాలను అమలు చేస్తున్నామని ఉవచిస్తున్నా.. ఆయన ఇమేజ్‌కు మాత్రం డ్యామేజీ ఏర్పడడం గమనార్హం.
ఇంతగా కేసీఆర్ ఇమేజ్ డ్యామేజీ కావడం గతంలో లేకపోవడం.. కేవలం 36 శాతం మంది మాత్రమే ఆయనను సీఎంగా చూడాలని కోరుకుంటున్నట్టు స్పష్టం కావడం.. నిజంగానే బీఆర్ ఎస్‌లో పెనుకుదుపునకు దారితీస్తోంది. దీనిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.