స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు 52 రోజులపాటు రాజమండ్రి సెంట్రల్ జైల్లో జ్యుడీషియల్ రిమాండ్ పై ఉన్న సంగతి తెలిసిందే. ఇటీవల హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేయడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ఈ నేపథ్యంలోనే చంద్రబాబుతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హైదరాబాదులో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి గురించి పవన్ ఆరా తీశారు. చంద్రబాబును పరామర్శించిన పవన్ ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
దాదాపు 2 గంటలపాటు చంద్రబాబుతో సమావేంలో పాల్గొన్నారు పవన్. టీడీపీ-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోపైన వీరిద్దరూ చర్చించినట్లు తెలుస్తోంది. అమరావతిని రాజధానిగా కొనసాగించడం, విశాఖ తిరుపతి, విజయవాడ ను క్లస్టర్లవారీగా మహానగరాలుగా అభివృద్ధి చేయడం అనేది షణ్ముఖ వ్యూహంలో తొలి అంశంగా ఉంది. సంపన్న ఏపీ పేరుతో వివిధ రంగాలకు ఆర్థిక ప్రోత్సాహం అందించడం, వ్యవసాయం- బంగారు ఫల సాయం పేరుతో ఉద్యాన రైతులకు 5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేయడం, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు ప్రోత్సాహకాలు ఇవ్వడం, చిన్న నీటిపారుదల రంగాన్ని ప్రోత్సహించడం వంటిది రెండో అంశంగా ఉంది.
మన ఏపీ-మన ఉద్యోగాలు పేరుతో ప్రతి ఏటా నిరుద్యోగుల కోసం పోస్టుల భర్తీ ప్రక్రియ, సిపిఎస్ రద్దు చేసి ఓ పి ఎస్ అమలు చేయడం మూడో అంశంగా ఉంది. ఇక, చిరు వ్యాపారులు, చిన్న తరహా పరిశ్రమలకు 10 లక్షల ఆర్థిక సహాయం, చిన్న తరహా పరిశ్రమలకు చేయూత, ఉద్యోగాల కల్పన దిశగా ప్రణాళిక, ఏటా లక్ష మంది యువ పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం వంటివి నాలుగో అంశం. ఇక, 30 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు చేయూత ఐదో అంశం. దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాల ఇళ్లకు ఉచితంగా ఇసుక పంపిణీ చేయడం ఆరో అంశం.
Gulte Telugu Telugu Political and Movie News Updates