ఏబీపీ-సీఓట‌రు స‌ర్వే.. తెలంగాణ నాడి దొరికిన‌ట్టేనా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఎవ‌రు గెలుస్తారు?  ఎవ‌రు ఓడతారు? ఏ పార్టీకి ఎన్ని సీట్లు వ‌స్తాయి? ఏ పార్టీ మెజారిటీ ద‌క్కించుకుని అధికారంలోకి వ‌స్తుంది?  ఓట్ల షేరింగ్‌.. ఓటు బ్యాంకు పాలిటిక్స్ ఎలా న‌డుస్తాయి?  ఇవ‌న్నీ.. న‌రాలు తెగే ఉత్కంఠ‌ను రేపుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే అనేక సంస్థ‌లు త‌మ తమ స‌ర్వేల‌ను ప్ర‌క‌టించాయి. కొన్ని కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉంటే.. మెజారిటీ స‌ర్వేలు మాత్రం బొటాబొటిగా ఫ‌లితం వ‌స్తుంద‌ని తేల్చి చెప్పాయి.

దీంతో ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న ఉత్కంఠ అలానే కొన‌సాగుతోంది. తెలంగాణ ఓట‌రు నాడిని గుర్తించ‌లేక పోతున్నార‌నే వాద‌న కూడా మేధావుల మధ్య వినిపిస్తోంది. ఎన్నిక‌ల‌కు ఇంకా స‌మ‌యం ఉండ‌డం.. పూర్తిస్థాయిలో అన్ని పార్టీలూ ప్ర‌చార ప‌ర్వాన్ని ప్రారంభించ‌క‌పోవ‌డం.. పంప‌కాలు మొద‌లు కాక‌పోవ‌డం.. మేనిఫెస్టోలు రాక‌పోవ‌డంతో ప్ర‌జ‌ల నాడిని ప‌ట్టుకోవ‌డంలో స‌ర్వే సంస్థ‌లు త‌ర్జ‌న భ‌ర్జ‌న ప‌డుతున్నాయి.

ఇదిలావుంటే. తాజాగా జాతీయ‌స్థాయిలో మంచి పేరున్న ఏబీపీ-సీఓట‌రు సంస్థ నిర్వ‌హించిన స‌ర్వే ఫ‌లితాల‌ను విడుద‌ల చేసింది. దీని ప్ర‌కారం.. మొత్తం 119 నియోజ‌క‌వ‌ర్గాల్లో అధికార పార్టీ బీఆర్ ఎస్‌కు 49 నుంచి 61 సీట్లు ద‌క్కే అవ‌కాశం ఉంద‌ని సంస్థ తేల్చింది. ఇక‌, ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం కాంగ్రెస్‌కు 43 నుంచి 55 సీట్లు ద‌క్కుతాయ‌ని తేల్చింది. ఇక‌, అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని చెబుతున్న బీజేపీకి 5 స్థానాల నుంచి 11 మాత్ర‌మే ద‌క్కే ఛాన్స్ ఉంద‌ని స‌ర్వే సంస్థ వెల్ల‌డించింది.

ఇక‌, మ‌రో పార్టీ ఎంఐఎం 9 స్థానాల్లో పోటీ చేస్తున్న విష‌యం తెలిసిందే. అయితే.. ఆ పార్టీ 6 నుంచి 8 స్థానాల్లో విజ‌యం ద‌క్కించుకునే అవ‌కాశం ఉంద‌ని ఏబీపీ-సీఓట‌రు స‌ర్వే పేర్కొంది. అయితే.. పైన చెప్పుకొన్న అనేక సందేహాలు ఉన్న నేప‌థ్యంలో స‌ర్వేలు ఏమేర‌కు నిజ‌మ‌వుతాయో చూడాలి. కాగా, ఏ పార్టీ అధికారంలోకి రావాల‌న్నా క‌నీసం 60 స్థానాల‌ను ద‌క్కించుకోవాల్సి ఉంటుంది.