టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ఇంటికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల ఇంచార్జ్ నాదెండ్ల మనోహర్ వెళ్లి ఆయనను పరామర్శించారు. చంద్రబాబు జైలు నుంచి బయటకు వచ్చిన సమయంలో పవన్ కుటుంబ కార్యక్రమా ల నేపథ్యంలో ఇటలీ వెళ్లారు. ఈ క్రమంలో బాబును పరామర్శించలేక పోయారు. దీనిని దృష్టిలో పెట్టుకుని ఇటలీ నుంచి తిరిగి వచ్చిన మర్నాడే పవన్, చంద్రబాబుతో ఆయన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆరోగ్యం గురించిన విషయాలను చంద్రబాబుతో చర్చించారు. అనంతరం రాజకీయ అంశాలపై ఇరు వురు నేతలు దృష్టి పెట్టినట్టు సమాచారం.
అయితే.. రాజకీయ అంశాలపై పవన్‌తో నేరుగా స్పందించని చంద్రబాబు నారా లోకేష్‌ను రంగంలోకి దింపారు. దీంతో నారా లోకేష్‌తో గంటలకు పైగా పవన్, మనోహర్‌లు చర్చలు జరిపారు. వచ్చే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఏపీలో ఇరు పార్టీలూ కలిసి పోరాడనున్న నేపథ్యంలో ఇప్పటికే సమన్వయ కమిటీలను ఏర్పాటు చేశారు. ఈ కమిటీలు.. ఇరు పార్టీల్లో ఉన్న అసంతృప్తులను తగ్గించి.. పార్టీలను కలిసి పోరాడేలా.. ప్రజలకు చేరువయ్యేలా చేస్తున్నాయి. అయితే.. వైసీపీ దూకుడు, ప్రభుత్వ పాలన అంశాలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టి.. మరిన్ని ఉమ్మడి కార్యక్రమాలను చేపట్టాలని టీడీపీ-జనసేనలు నిర్ణయించాయి.
ఈ క్రమంలో ఆయా అంశాలపై నారా లోకేష్‌తో పవన్ చర్చించినట్టు టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. సమన్వయ సమావేశాలకు తోడుగా.. త్వరలోనే ఇరు పార్టీలు ప్రజల మధ్యకురావాలని నిర్ణయించాయి. ఉమ్మడి మేనిఫెస్టో రూపకల్పన, బహిరంగ సభలు, ప్రజలను కలుసుకోవడం వంటి అంశాలపై ఇరు పార్టీలు కూడా.. సంయుక్తంగా ముందుకు సాగాలే కార్యాచరణకు రూపకల్పన చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. త్వరలోనే పవన్-నారా లోకేష్‌లు సంయుక్తంగా సభను నిర్వహించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి.
అంతేకాదు.. డిసెంబరు తొలి వారం నాటికి.. సంక్రాంతి కానుకగా.. ఉమ్మడి మేనిఫెస్టోను రూపొందించి విడుదల చేయాలని ఒక నిర్ణయానికి వచ్చినట్టు చెబుతున్నాయి. మొత్తానికి పవన్‌తో నారా లోకేష్ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. అంతేకాదు.. ఇరువురు నాయకులు కలిసి ప్రజల మధ్యకు వెళ్తే.. ఏపీ రాజకీయం మరింత వేడెక్కుతుందని టీడీపీ నాయకులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates