వైసీపీ అధినేత జగన్ తోపాటు ఎంపీ విజయసాయిరెడ్డిలు అక్రమాస్తుల కేసులో బెయిల్ పై ఉన్న సంగతి తెలిసిందే. దాదాపు పదేళ్లుగా సీబీఐ, ఈడీ కేసుల విచారణను ఎదుర్కొంటున్న ఈ ఇద్దరు బెయిల్ పై ఉండి అధికార పార్టీ తరఫున అధికారం చలాయిస్తున్నారని టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విజయసాయిరెడ్డిపై బీజేపీ ఏపీ అధ్యక్షురాలు విమర్శలు గుప్పించారు. విజయసాయిరెడ్డిపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్ కు పురందేశ్వరి ఫిర్యాదు చేశారు.
బెయిల్ పై ఉన్న విజయసాయి అరాచకాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. వివేకా హత్య సమయంలో ఆయన గుండెపోటుతో చనిపోయారని ప్రజలందరినీ తప్పుదోవ పట్టించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ చార్జిగా విజయసాయి ఉన్న సమయంలో కడప గూండాలను దించి భారీగా భూ ఆక్రమణలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఎందరినో బెదిరిస్తూ అక్రమాలు, అరాచకాలు చేశారని విజయసాయిపై ఉన్న కేసుల వివరాలను తన ఫిర్యాదులో వెల్లడించారు.
ఆల్రెడీ విజయసాయిపై 11 అభియోగాలు, అనేక సెక్షన్ల కింద కేసులున్నాయని పురందేశ్వరి విమర్శించారు. పదేళ్లుగా బెయిల్ పై బయట ఉంటూ సీబీఐ, ఈడీ కేసుల్లోని షరతులను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. ప్రతి కేసులోనూ విచారణ జరగకుండా నిరోధిస్తున్నారని, పదేపదే వాయిదాలు కోరుతూ విచారణను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. విజయసాయి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని ,దానిపై విచారణ జరపాలని ఆయన బెయిల్ ను తక్షణమే రద్దు చేయాలని సీజేఐని కోరారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates