హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే.. కానీ పునాది వేసింది కాంగ్రెస్!

తెలంగాణలో కేసీఆర్ ను గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ సాగుతోంది. ఆ దిశగా దొరికిన ఏ చిన్న అవకాశాన్ని కూడా కాంగ్రెస్ వదులుకోవడం లేదు. విమర్శలు, ఆరోపణలతో ముప్పేట దాడి చేస్తూ బీఆర్ఎస్ ను ఓడించాలనే సంకల్పంతో కదులుతోంది. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ డెవలప్మెంట్ గురించి బీఆర్ఎస్ నేతలు గొప్పగా చెబుతున్నారు. హైదరాబాద్ ను తామే డెవలప్ చేశామని చెప్పుకుంటున్నారు. ఇప్పుడీ విషయంలో కాంగ్రెస్ ఫోకస్ పెట్టింది. హైదరాబాద్ డెవలప్మెంట్ కు బీఆర్ఎస్ కారణం కాదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలే అందుకు నిదర్శనమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

హైదరాబాద్ డెవలప్మెంట్ కు హైటెక్ సిటీ కారణమని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. కానీ ఈ హైటెక్ సిటీ నిర్మాణం ఘనతను కాంగ్రెస్ ఖాతాలో వేసేలా రేవంత్ వ్యాఖ్యలు చేశారు. హైటెక్ సిటీ కట్టింది మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అని రేవంత్ పేర్కొనడం హాట్ టాపిక్ గా మారింది. చంద్రబాబు కారణంగానే హైటెక్ సిటీ ఏర్పడిందని రేవంత్ స్పష్టం చేశారు. కానీ ఇలా చెప్పి వదిలేస్తే కాంగ్రెస్ కు కలిగే ప్రయోజనం శూన్యమే. అందుకు రేవంత్ తెలివిగా వ్యవహరించారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

హైటెక్ సిటీ కట్టింది చంద్రబాబే కానీ పునాది వేసింది మాత్రం కాంగ్రెస్ సీఎం నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి అని రేవంత్ పేర్కొన్నారు. 1990 డిసెంబర్ నుంచి 1992 అక్టోబర్ వరకు నేదురుమల్లి జనార్ధన్ రెడ్డి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఆ సమయంలోనే హైదరాబాద్లో హైటెక్ సిటీకి పునాది పడిందని రేవంత్ పేర్కొన్నారు. ఇలా హైటెక్ సిటీ ని తమ ఖాతాలో వేసుకుని, హైదరాబాద్ డెవలప్మెంట్ కు కాంగ్రెస్ కారణమని చెప్పడమే రేవంత్ ఉద్దేశమని తెలుస్తోందని చెప్పాలి.