తెలంగాణ కాంగ్రెస్‌కు ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి మ‌ద్ద‌తు!

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీ త‌ర‌ఫున ప్ర‌చారం చేసేందుకు ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి రెడీ అయింది. ఈ స‌మితి అధ్య‌క్షుడు కొలిక‌పూడి శ్రీనివాస‌రావు తాజాగా టీ పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌ఫున 24 నియోజ‌క‌వ‌ర్గాల్లో ప్ర‌చారం చేస్తామ‌ని శ్రీనివాస్ చెప్పారు. ముఖ్యంగా సెటిల‌ర్లు.. ఏపీ ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉన్న నియోజ‌క‌వ‌ర్గాల్లో ఏపీ ప‌రిర‌క్ష‌ణ సమితి ప్ర‌చారం చేయ‌నుంది.

ఏమిటీ స‌మితి?

ఏపీ ప‌రిర‌క్ష‌ణ స‌మితి.. 2021లో ఏర్ప‌డింది. రాజ‌ధాని అమ‌రావ‌తిని కాద‌ని.. వైసీపీ ప్ర‌భుత్వం మూడు రాజ‌ధానుల నినాదం ఎంచుకున్న నేప‌థ్యంలో ఇక్క‌డి రైతులు ఉద్య‌మబాట ప‌ట్టారు. ఈ స‌మ‌యంలో అన్ని వ‌ర్గాల నుంచి రైతుల‌కు మ‌ద్ద‌తు ల‌భించింది. ఇలాంటి స‌మ‌యంలో తాము కూడా చేతులు క‌లుపుతామంటూ.. కొలిక‌పూడి శ్రీనివాస్ నేతృత్వంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప‌రిర‌క్ష‌ణ స‌మితిని ఏర్పాటు చేశారు. అప్ప‌టి నుంచి రైతుల‌కు, రాజ‌ధానికి మ‌ద్ద‌తుగా ఈ స‌మితి వ్య‌వ‌హ‌రిస్తోంది.

అమ‌రావ‌తి రైతులు చేసిన పాద‌యాత్ర‌ల్లో ఈ స‌మితి కీల‌క పాత్ర పోషించింది. అదేస‌మ‌యంలో వైసీపీ స‌ర్కారు ప్ర‌జావ్య‌తిరేక విధానాల‌ను నిరసిస్తూ.. అనేక సంద‌ర్భాల్లో నిర‌స‌న‌లు కూడా వ్య‌క్తం చేసింది. కొలికపూడి శ్రీనివాస్‌.. రాజ‌ధాని పాద‌యాత్రను తూర్పుగోదావ‌రిలో నిలిపివేసిన స‌మ‌యంలో ఒంట‌రిగా.. న‌డిచి.. గ‌మ్యాన్ని పూర్తి చేశారు. త‌ర్వాత‌.. చంద్ర‌బాబుపై కేసుల‌ను నిర‌సిస్తూ.. ఇటీవ‌ల కొన్ని రోజుల పాటు రిలే నిరాహార దీక్ష‌లు చేశారు. ఇప్పుడు తెలంగాణ‌లో ఏపీ ప్ర‌జ‌లు ఎక్కువ‌గా ఉన్న స్థానాల్లో కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప‌ల‌కాల‌ని నిర్ణ‌యించారు. అయితే.. ఇది ఏమేర‌కు స‌క్సెస్ అవుతుందో.. చూడాలి.