ఏపీ సీఐడీ అధికారుల తీరును రాష్ట్ర హైకోర్టు తప్పుబట్టింది. సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై అసహనం వ్యక్తం చేసింది. “ప్రతివాదిపై(చంద్రబాబు) మీరు పెట్టాలని కోరుతున్న షరతులు ఎందుకో మాకు తెలుసు” అంటూ వ్యాఖ్యానించింది. దీంతో ఏపీ సీఐడీ తరఫు న్యాయవాది మౌనం వహించారు.
ఏం జరిగింది?
ఏపీ మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కేసులో అరెస్టు చేయడం, జైల్లో పెట్టడం తెలిసిందే. అయితే.. 52 రోజలు తర్వాత.. ఆయనకు హైకోర్టు ఆరోగ్య కారణాలతో మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలోనే కొన్ని షరతులు కూడా విధించింది. అంతేకాదు.. ఎక్కడైనా వైద్యం చేయించుకునేందుకు అనుమతి కూడా ఇచ్చింది. దీంతో చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. ఆ వెంటనే ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను తప్పు చేయను, చేయనివ్వనని వ్యాఖ్యానించారు. ఇక, బాబు విడుదలతో టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున ఆయనకు బ్రహ్మరథం పట్టారు. రాజమండ్రి నుంచి విజయవాడ వరకు దారి పొడవునా.. వేచి ఉండి.. అభిమాన నాయకుడికి స్వాగతం పలికారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన అదే రోజు స్పందించిన సీఐడీ.. చంద్రబాబుపై మరో పిటిషన్‌ను దాఖలు చేసింది.
చంద్రబాబుపై మరిన్ని ఆంక్షలు విధించాలని కోరింది. ఆయన ఎక్కడా మీడియాతో మాట్లాడరాదని, ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, కేవలం వైద్యానికి మాత్రమే పరిమితం కావాలని, రాజకీయ ర్యాలీల్లో పాల్గొనరాదని, ఆయనను నిరంతరం గమనించేలా ఇద్దరు డీఎస్పీలను నియమిస్తూ ఆదేశించేలా కోరుతూ.. పిటిషన్ వేసింది. దీనిని విచారణకు స్వీకరించిన హైకోర్టు.. తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది.
చంద్రబాబు కార్యకలాపాల పరిశీలనకు ఇద్దరు డీఎస్పీలను పెట్టాలన్న సీఐడీ అభ్యర్థనను నిర్ద్వంద్వంగా తిరస్కరించింది. అదేసమయంలో స్కిల్ కేసు అంశాలపై మీడియాతో మాట్లాడవద్దని గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగుతాయని, రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని గతంలోనే ఆదేశించామని పేర్కొంది. ఇప్పుడు కొత్తగా సీఐడీ కోరుతున్న షరతుల వెనుక ఉద్దేశం తమకు తెలుసునని వ్యాఖ్యానించింది. ఇలాంటి పిటిషన్లతో కోర్టు సమయం వృథా చేస్తున్నారని అసహనం వ్యక్తం చేయడం గమనార్హం.
Gulte Telugu Telugu Political and Movie News Updates