టీడీపీ సానుభూతి ఓట్లు ఎవరికి?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీకి దూరంగా ఉన్నప్ప‌టికీ.. టీడీపీ ఓటు బ్యాంకు మాత్రం పెద్ద‌గా ప్ర‌భావితం కాలేదు. ఆ పార్టీ విష‌యంలో ఐటీ ఉద్యోగుల నుంచి సెటిల‌ర్ల వ‌రకు సానుభూతి వ్య‌క్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్టు స‌మ‌యంలోనూ.. త‌ర్వాత‌.. ఆయ‌న జైలు నుంచి మ‌ధ్యంతర బెయిల్ పై బ‌య‌ట‌కు వ‌చ్చాక హైద‌రాబాద్ స‌హా.. ఖ‌మ్మం, న‌ల్ల‌గొండ ఉమ్మ‌డి జిల్లాల్లో ప్ర‌జ‌లు బారులు తీరి ఆయ‌నకు మ‌ద్ద‌తు తెలిపారు.

దీనిని గ‌మ‌నించిన వారు.. టీడీపీ సానుభూతి ఓటు ప‌దిలంగానే ఉంద‌ని చెబుతున్నారు. అయితే, ఈ ద‌ఫా మాత్రం టీడీపీ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండిపోయింది. దీంతో ఈ పార్టీ ఓటు బ్యాంకు ఎటు మ‌ళ్లుతుంది? అనేది ఆస‌క్తిగా మారింది. ఇక‌, టీడీపీ ఎన్నిక‌ల‌కు దూరంగా ఉంటుంద‌ని తెలియ‌డంతో అధికార పార్టీ బీఆర్ ఎస్ ఈ సానుభూతి ఓట్ల‌నుత న‌వైపు మ‌లుచుకునేందుకు ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేసింది.

చంద్ర‌బాబు అరెస్టును ఖండించ‌డంతోపాటు.. ఆయ‌న కుటుంబానికి మ‌ద్ద‌తు కూడా తెలిపింది. మంత్రుల నుంచి నాయ‌కుల వ‌ర‌కు.. అంద‌రూ చంద్ర‌బాబుకు సానుకూలంగా ఉన్నార‌నే సంకేతాలు బ‌లంగానే పంపించారు. అయితే.. తొలినాళ్ల‌లో చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తు తెలిపిన ఐటీ ఉద్యోగుల‌పై పోలీసుల‌ను ప్ర‌యోగించార‌నే విమ‌ర్శ‌లు ఉన్నాయి. అదేస‌మ‌యంలో ఎక్క‌డో ఏపీలో చంద్ర‌బాబును అరెస్టు చేస్తే ..ఇక్క‌డ నిర‌స‌న‌లు ఎందుక‌న్న కేటీఆర్ వ్యాఖ్య‌లు కూడా ఉన్నాయి.

అయితే.. ఈ త‌ప్పును స‌రిచేసుకున్న బీఆర్ఎస్ నేత‌లు.. త‌ర్వాత స్వ‌రం మార్చారు. దీని వెనుక టీడీపీ సానుభూతి ఓటును త‌మ‌వైపు తిప్పుకొనే వ్యూహం ఉంద‌నే వాద‌న ఉంది. ఇదిలావుంటే, కాంగ్రెస్ పార్టీ కూడా టీడీపీ ఓటు బ్యాంకుపై వ‌ల వేసింది. కీల‌క నాయ‌కులు.. మ‌ధు యాష్కీ గౌడ్ నుంచి హ‌నుమంత‌రావు వ‌ర‌కు ప‌లువురు నాయ‌కులు.. చంద్ర‌బాబు అరెస్టుపై తీవ్రంగా స్పందించారు. వైసీపీపై విమ‌ర్శ‌లు కూడా గుప్పించారు. మొత్తంగా టీడీపీ సానుకూల ఓటు ను త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నం చేశారు.

అటు బీఆర్ఎస్‌, ఇటు కాంగ్రెస్‌లు మాత్ర‌మే టీడీపీ ఓటు బ్యాంకు కోసం ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రంగా సాగిస్తున్నాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నాయి. అయితే.. వీరిలో ఏ పార్టీకి టీడీపీ అనుకూల ఓటు ప‌డుతుంది? ఆ పార్టీ ఎవ‌రికి ప‌రోక్షంగా మ‌ద్ద‌తు ప‌లుకుతుంది? ఎన్నిక‌ల‌కు ముందు ఎలాంటి పిలుపు ఇస్తుంది? అనేది చూడాల్సి ఉంది.