తెలంగాణాలో కాంగ్రెస్ పార్టీ బలంగా ఉన్న నియోజకవర్గాలపైనే కేసీయార్ ఫోకస్ పెట్టినట్లు అర్ధమవుతోంది. దసరా పండుగ తర్వాత మొదలైన బహిరంగ సభల్లో ఎక్కువ నియోజకవర్గాలు కాంగ్రెస్ కు బాగా పట్టున్న నియోజకవర్గాలు కావటమే గమనార్హం. ఇప్పటివరకు కేసీయార్ 15 నియోజకవర్గాల్లో బహిరంగసభల్లో పాల్గొన్నారు. వీటిలో అచ్చంపేట, హుజూర్ నగర్, కోదాడ, పాలేరు, జుక్కల్, బాన్సువాడ, తుంగతుర్తి, ఆలేరు, నారాయణ్ ఖేడ్, మిర్యాలగూడ, దేవరకొండ, వనపర్తి, మునుగోడు వర్ధన్నపేట, మహబూబాబాద్ నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించారు.
ఈరోజు అంటే బుధవారం సత్తుపల్లి, ఇల్లెందు నియోజకవర్గాల్లో పాల్గొనబోతున్నారు. పై నియోజకవర్గాలన్నీ కూడా సంప్రదాయంగా కాంగ్రెస్ కు బలమైన నియోకవర్గాలనే ప్రచారంలో ఉన్నాయి. వివిధ కారణాలతో కొన్నిచోట్ల బీఆర్ఎస్ ఎంఎల్ఏలున్నారు. అయితే రాబోయే ఎన్నికల్లో పై నియోజకవర్గాల్లో మళ్ళీ కాంగ్రెస్ చేతికే చిక్కబోతున్నాయానే ప్రచారం అందరికీ తెలిసిందే. అందుకనే ముందుగా కాంగ్రెస్ గెలుస్తుందనే ప్రచారంలో ఉన్న నియోజకవర్గాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం.
కాంగ్రెస్ అభ్యర్ధుల మానసిక స్ధైర్యాన్ని దెబ్బతీస్తే బీఆర్ఎస్ విజయం ఖాయమని కేసీయార్ అనుకుంటున్నారు. ఇందులో భాగంగానే కోట్ల రూపాయలు ఖర్చులు చేసి భారీ బహిరంగసభలు నిర్వహిస్తున్నారు. అయితే బహిరంగసభల్లో పాల్గొంటున్న జనాల స్పందనను బట్టే బహిరంగసభలు విజయవంతమయ్యాయా లేదా అన్నది తేలుతుంది. ఈ కోణంలో చూస్తే కేసీయార్ సభలు సక్సెస్ అయినట్లు ఫీడ్ బ్యాక్ రావటంలేదట. బహిరంసభలు అయిపోయగానే జనాల స్పందన కోసం ఇంటెలిజెన్స్ వర్గాలు రంగంలోకి దిగుతాయి. ఆ ఫీడ్ బ్యాక్ లో పాజిటివ్ రెస్పాన్స్ రావటంలేదనే రిపోర్టు అందుతోందట.
అందుకనే కేసీయార్ స్పీచుల్లో వ్యక్తిగతంగా కాంగ్రెస్ నేతలను ఎటాక్ చేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. కారణాలు తెలీదు కానీ కేసీయార్ ప్రసంగంలో మునుపటి వేడి, వాడి తగ్గిపోయింది. పైగా ఓడిపోతే పోయి ఫాం హౌస్ లో విశ్రాంతి తీసుకుంటానని కేసీయార్ చేసిన ప్రకటన కూడా నెగిటివ్ సంకేతాలను పంపింది. కేసీయార్లో అప్పుడే ఓటమి భయం పెరిగిపోతోందని కాంగ్రెస్ నేతలు ప్రచారం మొదలుపెట్టారు. మేడిగడ్డ బ్యారేజి పిల్లర్ కుంగుబాటు, టీఎస్ పీఎస్సీ పరీక్షల నిర్వహణలో ఫెయిలైనట్లు కేటీయార్ అంగీకరించటం లాంటి అనేక కారణాలతో బీఆర్ఎస్ పై జనాల్లో వ్యతిరేకత పెరిగిపోతోందని సమాచారం. మరి చివరకు కేసీయార్ ఏమిచేస్తారో చూడాల్సిందే.
Gulte Telugu Telugu Political and Movie News Updates