చంద్ర‌బాబు అరెస్టు వెనుక పెద్ద క‌థే న‌డిచింది: కేవీపీ

టీడీపీ అధినేత చంద్ర‌బాబు అరెస్టుపై ఎట్ట‌కేల‌కు స్పందించిన కాంగ్రెస్ సీనియ‌ర్ నాయ‌కుడు, వైఎస్ ఆత్మ‌గా పేరున్న కేవీపీ రామ‌చంద్ర‌రావు సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లో ఆయ‌న మాట్లాడుతూ.. చంద్ర‌బాబు అరెస్టు వెనుక పెద్ద క‌థే న‌డిచింద‌న్నారు. దీనిని కేంద్రంలోని బీజేపీ ప్ర‌భుత్వం ఆడుతున్న నాట‌కంగా ఆయ‌న పేర్కొన్నారు. “సీఎం జ‌గ‌న్‌ను అడ్డుపెట్టి కేంద్రం ఆడిన నాట‌కంలో చంద్ర‌బాబు పావుగా మారారు” అని కేవీపీ అన్నారు.

చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ కేంద్రంలోని పెద్ద‌ల వ్యూహం ఉంద‌ని, అయితే.. దీనిపై మాట్లాడేందుకు కొంద‌రికి ధైర్యం స‌రిపోవ‌డం లేద‌ని కేవీపీ వ్యాఖ్యానించారు. వైసీపీ అధినేత జ‌గ‌న్‌ను అడ్డుపెట్టుకుని బీజేపీ ఈ దుశ్చ‌ర్య‌కు దిగింద‌ని కేవీపీ చెప్పారు. ఈ వ్య‌వ‌హారం అంద‌రికీ తెలిసిదేన‌ని, రాష్ట్రంలో ఎవరిని అడిగినా చెబుతారని అన్నారు. అనేక రోజుల నిరీక్షణ తరవాత టీడీపీ యువ‌నేత నారా లోకేష్‌కు హోంమంత్రి అమిత్‌షా అపాయింట్‌మెంట్‌ ఇవ్వడమే దీనికి నిదర్శనమని కేవీపీ విమ‌ర్శించారు.

మ‌ద్యం వ‌ద్ద‌ని.. ఆదాయం ముద్ద‌ని!

సీఎం జ‌గ‌న్ అధికారంలోకి రాక‌ముందు ఒక మాట‌.. వ‌చ్చిన త‌ర్వాత‌.. మ‌రోమాటా మాట్లాడుతున్నార‌ని కేవీపీ విమ‌ర్శించారు. అన్ని వ‌ర్గాల‌ను ఆయ‌న అథోగ‌తి పాలు చేశార‌ని.. ఏ ఒక్క వ‌ర్గం కూడా రాష్ట్రంలో సంతోషంగా లేర‌ని కేవీపీ చెప్పారు. రైతులు ల‌బోదిబోమంటున్నా.. సీఎంకు చీమ‌కుట్టిన‌ట్టు లేద‌న్నారు. ఇక‌, మ‌ద్య నిషేధాన్ని విడ‌త‌ల వారీగా అమ‌లు చేస్తాన‌ని 2019 ఎన్నిక‌ల్లో హామీ ఇచ్చిన జ‌గ‌న్‌.. దాని ఆదాయాన్ని ఆనందంగా అనుభ‌విస్తున్నార‌ని వ్యాఖ్యానించారు.

“మ‌ద్యం వ‌ద్ద‌న్న జ‌గ‌నే.. ఇప్పుడు దానిపై వ‌చ్చే ఆదాయంతో ఆనందం పొందుతున్నారు” అని అన్నారు. రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై సరైన లెక్కలు లేవని, ఈ విక్రయాల్లో నగదే ఎందుకు తీసుకుంటున్నారని వైసీపీ ప్ర‌భుత్వాన్ని నిల‌దీశారు. ఆరోపణలు వచ్చినా కేంద్రం ఎందుకు పట్టించుకోవడం లేదన్నారు.