ఆ కండిషన్స్ ఉల్లంఘిస్తే బాబు బెయిల్ క్యాన్సిల్

సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. చంద్రబాబు కుడి కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ చేయాల్సిన నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ వరకు చంద్రబాబుకు కండిషనల్ బెయిల్ లభించింది. ఈ రోజు సాయంత్రం లేదా రేపు ఉదయం రాజమండ్రి జైలు నుంచి చంద్రబాబు విడుదల కాబోతున్నారని తెలుస్తోంది. జైలు నుంచి ఎయిర్ పోర్టుకు వరకు భారీ ర్యాలీ చేసేందుకు టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో చంద్రబాబు తిరుపతి వెళ్లి వెంకన్నను దర్శించుకొని అనంతరం హైదరాబాద్ ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్‌స్టిట్యూట్‌లో చికిత్స పొందుతారని తెలుస్తోంది.

చంద్రబాబు తనయుడు లోకేష్, కోడలు బ్రాహ్మణి ఇప్పటికే రాజమండ్రికి చేరుకున్నారు. యుద్ధం మొదలైందని టీడీపీ నాయకులు, కార్యకర్తలతో లోకేష్ అన్నారని తెలుస్తోంది. ఇక, చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ నవబంరు 10న విచారణకు రానుంది. మరోవైపు, మద్యం షాపుల కేటాయింపులో అవకతవకలు జరిగాయంటూ చంద్రబాబుపై మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసులో చంద్రబాబుకు ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన తరఫు లాయర్లు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, మెడికల్ గ్రౌండ్స్ పై బెయిల్ లో ఉన్న చంద్రబాబును మరో కేసులో అరెస్టు చేసే అవకాశం లేదని, కాబట్టి ఆ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చవచ్చని తెలుస్తోంది.

అయితే, చంద్రబాబుకు బెయిల్ మంజూరు చేసేందుకు హైకోర్టు కొన్ని షరతులు విధించింది. వాటిలో దేనిని ఉల్లంఘించినా బెయిల్ రద్దవుతుందని కోర్టు స్పష్టం చేసింది.

చంద్రబాబుకు హైకోర్టు విధించిన షరతులు:

రూ. 1 లక్ష విలువైన బెయిల్ బాండ్ (పూచీకత్తు)తో పాటు 2 ష్యూరిటీలు

ప్రత్యక్షంగా, పరోక్షంగా కేసును ప్రభావితం చేసే చర్యలు చేపట్టకూడదు

సాక్షులను, కేసుకు సంబంధించిన వ్యక్తులను ప్రభావితం చేయకూడదు.

నచ్చిన ఆసుపత్రిలో సొంత ఖర్చుతో చంద్రబాబు చికిత్స చేయించుకునే అవకాశం.

నవంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల్లోపు రాజమండ్రి జైల్లో చంద్రబాబు స్వయంగా సరెండర్ కావాలి.

సరెండర్ సమయంలో చికిత్స వివరాలను సీల్డ్ కవర్ లో జైలు సూపరింటెండెంట్ కు అందించాలి.