టీడీపీ అధినేత చంద్రబాబును తలుచుకుని ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ కన్నీటి పర్యంతమయ్యారు. విజన్ ఉన్న నాయకుడిని జైల్లో పెట్టిన వారు మట్టికొట్టుకుపోతారంటూ.. ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్వహించిన `సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్` కార్యక్రమంలో బండ్ల గణేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. కొద్దిసేపటి వరకు స్టేజీపై అలానే ఉండిపోయారు. చంద్రబాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండడంతో నేను దసరా పండుగను జరుపు కోలేదని ఆయన చెప్పారు.
దీపావళి పండుగని ఘనంగా జరుపుకునేలా చంద్రబాబుకు దేవుడు ఆశీర్వాదం ఇవ్వాలని బండ్ల వ్యాఖ్యానించారు. “చంద్రబాబు కోసం మా ప్రాణాలు ఇస్తాం. సైబరాబాద్ లాగా… ఏపీలోని అమరావతి, గుంటూరు, రాజమండ్రిని అభివృద్ధి చేద్దామని చంద్రబాబు అనుకున్నారు’’ అని బండ్ల గణేష్ పేర్కొన్నారు. జనం కోసిన బతికిన, బతుకుతున్న చంద్రబాబును జైల్లో పెట్టారంటూ.. గణేష్ కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, సభలో బండ్ల ప్రసంగం ఆసాంతం ఉద్వేగంగా సాగింది. “నారా భువనేశ్వరమ్మ చేపట్టిన నిజం గెలవాలి యాత్ర నిజంగానే నిజాన్ని గెలిపిస్తుంది. ఇది తథ్యం“ అని వ్యాఖ్యానించారు.
బాబు బయటకు రావాలి: బోయపాటి
`సీబీఎన్ గ్రాటిట్యూడ్ కాన్సెర్ట్` కార్యక్రమంలో పాల్గొన్న డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఉద్వేగానికి గురయ్యారు. ‘‘బాబు బయటకి రావాలి, అధికారంలోకి రావాలని న్యాయ పోరాటం చేస్తున్న వారికి కృతజ్ఞతలు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు ప్రపంచంలో ఏపీని తలెత్తుకొని తిరిగేలా చేశారు. చంద్రబాబుకు అండగా నిలిచిన ఉద్యోగులకు నా కృతజ్ఞతలు. త్వరలోనే చంద్రబాబు బయటికి వస్తారు, న్యాయాన్ని గెలిపించుకొని వస్తారు. ఐయామ్ విత్ యూ బాబు’’ అని బోయపాటి శ్రీను పేర్కొన్నారు.
ఈ కార్యక్రమానికి హాజరు కాలేక పోయిన ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు కూడా ట్విట్టర్(ఎక్స్) వేదికగా స్పందించారు. చంద్రబాబు పరిస్థితి తలుచుకుంటే గుండె తరుక్కుపోతోందని అన్నారు. ‘‘ఈ విశ్వనగరాన్ని నిర్మించిన మీకోసం లక్షలాది మంది తరలి రావడాన్ని చూస్తుంటే చాలా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నాను. మీతో ప్రయాణం చేయడం చాలా గర్వంగా ఉంది. అందుకు మీకు కృతజ్ఞుడిని. మీరు ఆరోగ్యంతో నూతన శక్తితో త్వరగా బయటకు రావాలని ఏడుకొండల వాడిని ప్రార్ధిస్తున్నాను’’ అని కె.రాఘవేంద్రరావు పేర్కొన్నారు.