నాగర్ కర్నూల్ టికెట్ ఆశించిన కాంగ్రెస్ సీనియర్ నాయకుడు నాగం జనార్ధన్ రెడ్డి పార్టీ మారేందుకు సిద్ధమయ్యారా? బీఆర్ఎస్ లో చేరబోతున్నారా? అంటే రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. నాగర్ కర్నూల్ లో తనకు కాకుండా రాజేష్ రెడ్డికి టికెట్ ఇవ్వడంతో తీవ్ర అసంత్రుప్తితో ఉన్న నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారని తెలిసింది. కేటీఆర్ తో భేటీ కావడానికి నాగం సిద్ధమవడమే అందుకు రుజువని చెప్పొచ్చు.
2012 ఉప ఎన్నికలు కలుపుకొని నాగర్ కర్నూల్ నుంచి నాగం జనార్ధన్ రెడ్డి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. కానీ 2018లో కాంగ్రెస్ తరపున పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఈ సారి ఎన్నికల్లోనూ బరిలో దిగాలని చూశారు. ఎన్నికల్లో పోటీకి ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికైన కూచుకుల్ల దామోదర్ రెడ్డి తనయుడు రాజేష్ కు తొలి జాబితాలో కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది. దీంతో నాగం జనార్ధన్ రెడ్డి మనస్థాపానికి గురయ్యారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై, కాంగ్రెస్ పార్టీపై నాగం తీవ్ర ఆరోపణలు చేశారు.
కానీ ఆ తర్వాత నాగం సైలెంట్ కావడంతో అన్నీ కుదురుకున్నాయనే అనుకున్నారు. కానీ ఇప్పుడు రెండో జాబితా వెల్లడి తర్వాత నాగం మళ్లీ రంగంలోకి దిగారు. పార్టీని వీడాలనే నిర్ణయానికి వచ్చారనే చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఉంటే లాభం లేదని ఆయన నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందుకే బీఆర్ఎస్ కండువా కప్పుకునేందుకు సిద్ధమయ్యారనే టాక్ వినిపిస్తోంది. కేటీఆర్ ను కలిసిన తర్వాత.. నాగం కాంగ్రెస్ ను వీడి కారెక్కడం ఖాయమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.