పాపం కోదండ‌రాం…ఇంత‌కంటే ఇంకేం చెప్ప‌లేం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బ‌రిలో దిగే అభ్య‌ర్థుల విష‌యంలో దాదాపు కీల‌క నియోజ‌క‌వ‌ర్గాలు, ప్ర‌ముఖ నేత‌ల స్థానాలు ఖ‌రారైపోయాయి. ఇక ఆయా పార్టీల మ‌ధ్య పొత్తుల ప్ర‌క్రియ కొలిక్కి వ‌చ్చేసింది అనే విష‌యం చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ త‌రుణంలో అన్ని పార్టీలు ఎన్నిక‌ల ప్ర‌క్రియ‌పై ఫోక‌స్ చేస్తుండ‌గా కేవ‌లం ఒకే ఒక పార్టీ, క‌రెక్టుగా చెప్పాలంటే తెలంగాణ ఉద్య‌మంలో నంబ‌ర్ 2 పాత్ర పోషించిన నాయ‌కుడి చూపు దీన స్థితికి చేరిపోయింది. ఆయ‌నే ప్రొఫెస‌ర్ కోదండ‌రాం, ఆయ‌న ఏర్పాటు చేసిన తెలంగాణ జ‌న స‌మితి పార్టీ.

అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీతో క‌లిసి సాగాల‌నుకున్న కోదండ‌రాంకు ఆది నుంచి నిరాశే ఎదురైంది. పొత్తుల ప్ర‌క్రియ‌లో ఆయ‌న్ను పెద్ద‌గా ప‌ట్టించుకున్న‌ది లేదు. టికెట్ల కేటాయింపు విష‌యంలో అయితే, టీజేఎస్ ఊసే ఎత్త‌లేదు. మ‌రోవైపు కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీల మధ్య పొత్తు ఖరార‌వ‌డం సీపీఎం, సీపీఐకి చెరో రెండు సీట్లు ఇచ్చేందుకు కాంగ్రెస్ అంగీకరించ‌డం జ‌రిగిపోయింది. ఈ మేర‌కు సీట్లపై కమ్యూనిస్టు నేతలకు కాంగ్రెస్ ముఖ్యనేతలు సమాచారం ఇచ్చారు. కానీ కోదండ‌రాం పార్టీని మాత్రం లైట్ అంటే లైట్ తీసుకున్నారు. ఇలా కూర‌లో క‌రివేపాకు లాగా మారిపోయిన కోదండ‌రాం పార్టీ త‌మ అస‌హ‌నాన్ని ప‌త్రిక ప్ర‌క‌ట‌న రూపంలో వ్య‌క్తం చేసింది.

తెలంగాణ జన సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మార్జున్, బైరి రమేష్ పేరుతో నేడు కోదండ‌రాం పార్టీ ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. ‘తెలంగాణ రాష్ట్రం లో జరుగనున్న శాసనసభ ఎన్నికలలో అప్రజాస్వామిక కుటుంబ పాలన సాగిస్తున్న కేసీఆర్, భారత రాష్ట్ర సమితి పార్టీని ఓడించుటకు కాంగ్రెస్ పార్టీ తో ఎన్నికల పొత్తుకు తెలంగాణ జనసమితి తన రాజకీయాలను రిజర్వ్ లో పెట్టుకొని సంప్రదింపులు, చర్చలకు పూనుకుంది. కానీ కాంగ్రెస్ పార్టీ మాతో చర్చలు తాత్సారం చేస్తూ అన్ని నియోజకవర్గాలలో తమ పార్టీ అభ్యర్థులను ప్రకటించుకుంది. కనీస గౌరవం ఇవ్వకుండా వ్యవహరిస్తున్న తీరును ఖండిస్తున్నాం. మా పార్టి నాయకులు కార్యకర్తలు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. కనీస పొత్తు ధర్మాన్ని పాటించకుండా ఆ పార్టీ నాయకులు తలా వొక తీరుగా మాట్లాడుతున్న తీరు సరైనది కాదు. ఈ పరిణామాలను మా పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. ప్రత్యామ్నాయాల పై చర్చ చేస్తున్నాం’ అంటూ ప్ర‌క‌ట‌న తెలిపింది. ఈ ప్ర‌క‌ట‌న చూసినంత‌నే… ఎలాంటి కోదండ‌రాం ఎలాంటి స్థితికి చేరిపోయారు అన్న చ‌ర్చ సోష‌ల్ మీడియాలో జ‌రుగుతోంది.