2019 ఎన్నికలకు ముందు వరకు ఏపీలో టీడీపీకి బలమైన నేతలు…అంతే బలమైన కేడర్ ఉంది. గల్లీ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు బలమైన నాయకులు ఉన్నారు. అయితే, 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత ఏపీలో బలమైన పార్టీగా ఉన్న టీడీపీ పరిస్థితి ఒక్కసారి మారిపోయింది.
టీడీపీలోని కొందరు ఎమ్మెల్యేలు వైసీపీలో అనధికారికంగా చేరిపోయారు. మరికొందరు వైసీపీ ఉక్కపోతకు తట్టుకోలేక ఫ్యాన్ గాలిలో సేద తీరేందుకు సిద్ధమవుతున్నారని టీడీపీ వర్గాలు గుసగుసలాడుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో ముఖ్యంగా టీడీపీకి పెట్టని కోట వంటి పశ్చిమగోదావరిలోని కొన్ని నియోజకవర్గాలతో పాటు ప్రకాశం జిల్లాలోని చీరాల నియోజకవర్గంలో టీడీపీ పట్టు కోల్పోయిందని టాక్.
ముఖ్యంగా టీడీపీ సీనియర్ నేత, చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం టీడీపీని వీడడంతో ఆ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలినట్లయింది. అయితే, చీరాలలో బలరాం స్థానంలో యెడం బాలాజీని టీడీపీ ఇన్ చార్జిగా నియమించినా…ఇప్పటికీ కరణం బలరాం మాటే టీడీపీ వర్గాల్లో చెల్లుబాటవుతుండడం అధిష్టానాన్ని కలవరపెడుతోంది.
కరణం బలరాం అనధికారింగా వైసీపీలో చేరినా నియోజకవర్గంలో ఆయన హవానే నడుస్తోంది. బలరాం నమ్మిన బంటు అయిన యడం బాలాజీ…ఆయన ఆదేశాల ప్రకారమే నడుచుకుంటున్నారని తెలుగు తమ్ముళ్లు అనుకుంటున్నారట. 2014లో ఇండిపెండెంట్ గా గెలిచి ఆ పై టీడీపీలో చేరిన ఆమంచి కృష్ణ మోహన్…ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ తరఫున బరిలో దిగి కరణం బలరాంపై పోటీ చేసి ఓడిపోయారు.
కరణం బలరాం టీడీపీని వీడి అనధికారికంగా వైసీపీలో చేరిపోవడం…చీరాలలో టీడీపీ బలమైన నేతలు మాజీ మంత్రి పాలేటి రామారావు, పోతుల సునీత, చిమటా సాంబు, సజ్జా చంద్రమౌళి వంటి నేతలు పార్టీని వీడడంతో చీరాలలో టీడీపీ చుక్కాని లేని నావలా తయారైందట. ఈ క్రమంలోనే చీరాల టీడీపీ బాధ్యతలను గతంలో చీరాల వైసీపీ ఇన్ చార్జిగా పనిచేసిన యడం బాలాజీకి అప్పగించారు.
అయితే, కరణం బలరాం ముఖ్య అనుచరుడైన బాలాజీ…బలరాం సూచనలను తు.చ తప్పకుండా పాటిస్తున్నారట. ఇంకా చెప్పాలంటే….ఇటు వైసీపీ…అటు టీడీపీ…రెండింటిలోనూ బలరాం కర్చీఫ్ వేసి ఉంచారని, 2024లో మళ్లీ బలరాం టీడీపీలో చేరినా ఆశ్చర్యపోనవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అందుకే, తన అనుచరుడు బాలాజీని ముందు పెట్టి తెరవెనుక బలరాం చక్రం తిప్పుతున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో చీరాల తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారట.
ఇప్పటికైన చంద్రబాబు చీరాల వ్యవహారంపై ఫోకస్ చేయకుంటే….చీరాలలో టీడీపీ పరిస్థితి మరింత అధ్వాన్నంగా తయారవుతుందని అక్కడి టీడీపీ నాయకులు అనుకుంటున్నారట. చీరాలలో కరణం బలరాం బాహుబలి అన్న రీతిలో ఉన్న పరిస్థితిని చంద్రబాబు ఏ విధంగా డీల్ చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates