వివిధ నియోజకవర్గాల్లో ద్వితీయ శ్రేణినేతలు పార్టీని వదిలేస్తుండటంపై కేసీయార్ బాగా మండిపోతున్నారట. ఎవరెవరు అసంతృప్తిగా ఉన్నారు, పార్టీని వదిలేసి వెళ్ళిపోయే నేతలు ఎవరు అనే అనుమానాలతో నియోజకవర్గాల్లో అభ్యర్ధులతో పాటు సీనియర్ నేతలను అలర్ట్ చేసినా పట్టించుకోవటంలేదని కేసీయార్ బాగా మండిపోతున్నారట. పార్టీ ముందుగానే హెచ్చరిస్తున్నా అసంతృప్తిగా ఉన్న నేతలను కలిసి ఎందుకు మాట్లాడటంలేదని ఎంఎల్ఏ అభ్యర్ధులకు కేసీయార్ ఫుల్లుగా క్లాసులు పీకుతున్నట్లు సమాచారం.
ఎన్నికల ప్రక్రియను సజావుగా చేసుకునేందుకు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోను ఒక వార్ రూమును ఏర్పాటుచేసిన విషయం తెలిసిందే. దీని ద్వారానే అన్నీ నియోజకవర్గాల్లో నేతల ప్రచారంతో పాటు అసంతృప్తుల కదలికలను కూడా కేసీయార్ ప్రతిరోజు తీసుకుంటున్నారు. పలానా నియోజకవర్గంలో నేత అసంతృప్తిగా ఉన్నారనే సమాచారం రావటం ఆలస్యం వెంటనే ఎంఎల్ఏ అభ్యర్ధిని అలర్ట్ చేస్తున్నారు. ఇంతచేస్తున్నా ఎంఎల్ఏ అభ్యర్ధులు లేదా సీనియర్లు స్పీడుగా స్పందించటంలేదు.
నల్గొండ, మల్కాజ్ గిరి, ఎల్బీనగర్, నాగార్జునసాగర్, మునుగోడు, జహీరాబాద్ లాంటి పాతిక నియోజకవర్గాల్లో పట్టున్న నేతలు కొందరు బీఆర్ఎస్ కు రాజీనామాలు చేశారు. పార్టీకి రాజీనామా చేసిన వారిలో అత్యధికులు కాంగ్రెస్ లో చేరుతుండటంతో కేసీయార్ లో టెన్షన్ పెరిగిపోతోంది. పార్టీని వీడుతున్న నేతల్లో ఎక్కువమంది ద్వితీయ శ్రేణినేతేలు కావటమే టెన్షన్ కు కారణంగా తెలుస్తోంది. వీళ్ళల్లో అత్యధికులు నియోజకవర్గ హెడ్ క్వార్టర్స్ లేదా మండల కేంద్రాల్లో పట్టున్న నేతలే కావటంతో రేపటి ఎన్నికల ఫలితాల్లో ప్రభావం చూపిస్తుందనే టెన్షన్ పెరిగిపోతోంది.
పార్టీ తరపున గెలిచిన ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచులు పార్టీకి మాత్రమే రాజీనామాలు చేస్తున్నారు. వీళ్ళ వల్ల కనీసం వందల ఓట్లయినా సరే ప్రభావం చూపటం ఖాయమని అధికారపార్టీలో వణుకు పెరిగిపోతోంది. రాబోయే ఎన్నికల్లో పోటీ హోరాహోరీగా జరుగుతుందని అనుకుంటున్నపుడు పది ఓట్లు కూడా ఎంతో విలువైన వన్న విషయం కొత్తగా చెప్పక్కర్లేదు. ఎన్నికల ముందు ద్వితీయ శ్రేణి నేతలు పార్టీని వదిలేయటం ఓట్లపరంగానే కాకుండా మానసికంగా కూడా జనాలపై ప్రభావం చూపుతుందన్నదే అసలైన సమస్య.