తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్.. గతానికి భిన్నంగా చాలా కష్టపడుతున్నారా? ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికలు ఆయన ప్రాణ ప్రతిష్టగా మారాయా? ఒక రకంగా ఆయనకు ఈ ఎన్నికలు ఇజ్జత్‌కే సవాల్‌గా మారాయా? అంటే.. ఔననే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. నిజానికి 2014, 2018 ఎన్నికలను పరిశీలిస్తే.. నామినేషన్ల ఘట్టం మొదలు అయ్యే వరకు కేసీఆర్ ప్రగతి భవన్ గడప దాటి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన పరిస్థితి లేదు.
అలా వచ్చిన తర్వాత కూడా.. కీలకమైన కొన్ని జిల్లాలనే ఎంపిక చేసుకుని అక్కడ మాత్రమే ప్రచారం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆయన తెలంగాణ సాధనను 2014లో ఆయుధంగా మార్చుకుని ప్రజల్లోకి వెళ్లగా.. 2018లో “ఆంధ్రోళ్ల పాలన మనకు అవసరమా?!”-అంటూ.. ప్రజలను తనవైపు తిప్పుకొన్నారు. చాలా సింపుల్‌గా ఆయన ప్రజలను ఆకర్షించారు. అయితే.. ఇప్పుడు ఈ రెండు ఎన్నికలకు మించి కష్టపడుతున్నారనేది విశ్లేషకులు చెబుతున్న మాట.
ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలను పరిశీలిస్తే.. నవంబరు 7వ తేదీ నుంచి నామినేషన్లు ప్రారంభం అవుతుండగా.. ఇప్పటికే కేసీఆర్ ఉదయం, సాయంత్రం సభలతో తీరిక లేకుండా గడుపుతున్నారు. జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రజలను తనవైపు తిప్పుకొనేందుకు పదేళ్ల పాలన తర్వాత కూడా.. ప్రయాస పడుతున్నారని అంటున్నారు విశ్లేషకులు. ఇప్పుడు మూడోసారి కూడా ఆయన విజయం దక్కించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెబుతున్నారు.
పైగా 2014, 2018 ఎన్నికల కంటే కూడా.. ఇప్పుడు తెలంగాణ అధికార పీఠానికి పోటీ భారీగా పెరిగిపోయింది. ఇది ఒకరకంగా కేసీఆర్‌కు ఇబ్బందిగా మారితే.. మరోవైపు కుటుంబ పాలన.. అవినీతి.. నీళ్లు, నిధులు, నియామకాల ప్రక్రియలు కూడా.. ఆయనకు తలనొప్పిగా పరిణమించాయని పరిశీలకులు చెబుతున్నారు. ఒకవైపు పొలిటికల్ పోటీ, మరోవైపు.. కేసీఆర్ కుటుంబ పాలన వంటివి ప్రతిపక్షాలకు ఆయుధాలుగా మారాయి.
ఈ నేపథ్యానికి తోడు లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ ఎస్ రెండు నుంచి మూడు రాష్ట్రాల్లో కనీసంగా అయినా పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అధికారం నిలబెట్టుకోకపోతే.. అది మరింత ఇబ్బందిని సృష్టించనుంది. ఇది కేసీఆర్ ఇజ్జత్‌కే సవాల్‌గా మారనుందని చెబుతున్నారు. ఈ క్రమంలోనే కేసీఆర్ ముందస్తుగానే చమటోడ్చే పరిస్థితి వచ్చిందని అంటున్నారు. ఈ పరిశ్రమ ఏమేరకు ఫలిస్తుందో చూడాల్సి ఉంటుందని అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates