యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ (వైఎస్ఆర్‌టీపీ) ఏర్పాటు చేసి తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తన ముద్ర వేసుకోవాలని భావించిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి తనయ వైఎస్ షర్మిలకు కాలం ఏ మాత్రం కలిసిరావడం లేదని చర్చ జరుగుతోంది. బలమైన పార్టీగా ఎదగాలనే దశ నుంచి కాంగ్రెస్‌లో విలీనం చేసే వరకు పడిపోయిన షర్మిల పార్టీ గ్రాఫ్ అనంతరం ఎన్నికల్లో పోరాటం చేసేందుకు నేతలను వెతుక్కునే వరకూ చేరింది. ఇప్పుడు తాజాగా కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయంతో ఆమె మరోమారు సోషల్ మీడియాలో నవ్వుల పాలు అవుతున్నారు.
కాంగ్రెస్‌లో విలీనం అవడం ఎటూ తేలకపోవడంతో తెలంగాణలోని 119 స్థానాల్లోనూ పోటీ చేయాలని షర్మిల నిర్ణయించి ఈ మేరకు ఎన్నికల సంఘానికి దరఖాస్తు చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం వైఎస్ఆర్‌టీపీకి బైనాక్యులర్ గుర్తును కేటాయించింది. షర్మిల పార్టీకి అన్ని నియోజకవర్గాల్లోనూ పోటీ చేసేందుకు ఈ గుర్తు కేటాయింపు చేశారు. దీనిపై వైఎస్ఆర్‌టీపీ నేతలు ఆనందం వ్యక్తం చేస్తుంటే… సోషల్ మీడియాలో మాత్రం సెటైర్లు వేస్తున్నారు. దీనికి కారణం, ఇప్పటి వరకు వైఎస్ఆర్‌టీపీ పొలిటికల్ జర్నీ సాగిన తీరు, ప్రస్తుత రాజకీయాల్లో ప్రత్యర్థులను టార్గెట్ చేసే విధానం.
యువజన శ్రామిక రైతు తెలంగాణ పార్టీ పేరుతో తెలంగాణ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చిన షర్మిల తెలంగాణలో 3,800 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు. తమ పార్టీ నుంచి నాయకులను తయారు చేస్తామని ఓ దశలో వైఎస్ షర్మిల ప్రకటించారు. అయితే, ఆశించిన స్థాయిలో పార్టీ బలపడలేదు. దీంతో కాంగ్రెస్‌లో విలీనం చేసేందుకు ఢిల్లీ వరకు షర్మిల వెళ్లినట్లుగా ప్రచారం జరిగింది. కానీ అది ఆచరణ రూపం దాల్చలేదు. దీంతో షర్మిల పార్టీ తెలంగాణలో ఒంటరిగా పోటీ చేయాలని భావించింది. అయితే, ఇప్పటికీ ఆ పార్టీకి మానిఫెస్ట్ కానీ, పార్టీ తరఫున పోటీ చేసే అభ్యర్థుల వివరాలు వంటివి కానీ వెల్లడి కాలేదు. క్షేత్రస్థాయిలోనూ పెద్దగా ఊపు కనిపించడం లేదు.
రాజకీయంగా ప్రస్తుత పొలిటికల్ హీట్ సమయంలో వైఎస్ఆర్‌టీపీ ఇలా నామమాత్రంగా మారిపోయిన తరుణంలో, ఊహించని రీతిలో బైనాక్యులర్ గుర్తును ఈసీ కేటాయించడం ఆమె రాజకీయ ప్రత్యర్థులకే కాకుండా సోషల్ మీడియాలో నెటిజన్లకు సైతం అవకాశంగా దొరికింది. షర్మిల పార్టీకి బైనాక్యులర్ గుర్తు మాత్రమే కాదు.. ఆ పార్టీని కూడా బైనాక్యులర్‌తో వెతకాలి అని కొందరు కామెంట్ చేస్తుంటే… మరికొందరు అభ్యర్థుల కోసం షర్మిల ఇలా బైనాక్యులర్‌తో వెతకాలి అంటూ సెటైర్లు వేస్తున్నారు. మొత్తంగా షర్మిల బ్యాడ్ టైంలో బైనాక్యులర్ గుర్తు కూడా చేరిపోయింది.