తెలుగుదేశం పార్టీ శ్రేణులు మరో దుర్వార్త వినడం ఖాయమని రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు జైల్లో ఉండటం, బెయిల్ విషయంలో బ్యాడ్ టైం కొనసాగుతున్న వేళ తెలంగాణలో ఆ పార్టీకి ఊహించని షాక్ ఎదురుకానుందట. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆ పార్టీకి గుడ్ బై చెప్పేయనున్నారని ప్రచారం జరుగుతోంది. దీనికి కారణం తెలంగాణ ఎన్నికలు, ఆ ఎన్నికల్లో టీడీపీ బరిలో దిగకపోవడం గురించి.
తెలంగాణలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ వైఖరి ఏంటనే ఆసక్తి నెలకొంది. ఓ దశలో పార్టీ పోటీ చేయబోదంటూ వార్తలు వెలువడ్డాయి. అయితే, పార్టీ అధ్యక్షుడి హోదాలో కాసాని జ్ఞానేశ్వర్ మాట్లాడుతూ అన్ని స్థానాల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. మరోవైపు తెలంగాణ లో తాము పోటీ చేయడం లేదంటూ టీడీపీ యువనేత లోకేశ్ పేరుతో ప్రకటన వెలువడింది. దీంతో పార్టీలో అసలేం జరుగుతోందనే చర్చ వినిపించింది. అదే సమయంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయవద్దంటూ పార్టీ అధినేత చంద్రబాబు ఆదేశంతో కాసాని జ్ఞానేశ్వర్ హర్టయినట్లు సమాచారం. దీంతో తనకు గౌరవం దక్కని పార్టీలో ఉండకూడదని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
ఓ వైపు తెలుగుదేశంలో అంతర్గత పరిణామాలు మరోవైపు కాసాని సొంత నిర్ణయం నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఎంట్రీ ఇచ్చినట్లు సమాచారం. గతంలో ముదిరాజ్ సంఘానికి పెద్దదిక్కుగా వ్యవహరించిన కాసాని జ్ఞానేశ్వర్ చేరిక తమకు కలిసి వస్తుందని భావించిన బీఆర్ఎస్ ఆయనతో చర్చలు జరిపినట్లు సమాచారం. అధికార బీఆర్ఎస్ పార్టీ ముదిరాజ్ సామాజిక వర్గానికి ఒక్క టికెట్ కేటాయించలేదు. యాభై లక్షల ఓట్లున్న తమను అధికార పార్టీ లెక్క చేయడం లేదని ముదిరాజ్ సామాజికవర్గం రాష్ట్ర వ్యాప్తంగా సభలు సమావేశాలు నిర్వహిస్తోంది. పటాన్ చెరు టికెట్ ఆశించిన నీలం మధు లాంటి నాయకులు బీఆర్ఎస్ పై యుద్ధం చేసినంత పనిచేశారు. ఈ నష్టాన్ని నివారించుకునేందుకు కాసానికి బీఆర్ఎస్ కండువా కప్పుతున్నట్లు సమాచారం. ఈ విషయంలో నేడో రేపో క్లారిటీ రానుంది.