టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోగ్యంపై ఆయన కుటుంబ సభ్యులతోపాటు టీడీపీ నేతలు, కార్యకర్తలు కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. చంద్రబాబు స్కిన్ ఎలర్జీతో బాధపడుతున్నారని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక, తాజాగా చంద్రబాబు కంటికి క్యాటరాక్ట్ ఆపరేషన్ అవసరమని వైద్యులు చెబుతున్న నేపథ్యంలో ఆయన ఆరోగ్యంపై ఆందోళన మరింత పెరిగింది. ఈ క్రమంలోనే తాజాగా చంద్రబాబు బెయిల్ పిటిషన్ పై అత్యవసర విచారణ జరపాలని ఏపీ హైకోర్టులో ఆయన తరఫు లాయర్లు హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు.
3 నెలల క్రితం చంద్రబాబు ఎడమ కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, ఇప్పుడు కుడి కంటికి ఆపరేషన్ జరపాల్సి ఉందని పిటిషన్ లో పేర్కొన్నారు. ఇక, చంద్రబాబు కంటి సమస్యలకు వైద్య చికిత్స అవసరమని ప్రభుత్వ వైద్యులు కూడా నివేదిక ఇచ్చినట్టు టీడీపీ నేతలు అంటున్నారు. కానీ, ఆ వైద్య నివేదికను మార్చి ఇవ్వాలంటూ వైద్యులపై జైలు అధికారులు ఒత్తిడి తెస్తున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తాజాగా విడుదలైన చంద్రబాబు హెల్త్ బులెటిన్ లో ఆ కంటి సమస్యను ప్రస్తావించకపోవడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఈ వ్యవహారంపై రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ స్పందించారు. చంద్రబాబుకు 4 నెలల క్రితం ఒక కంటికి కాటరాక్ట్ ఆపరేషన్ జరిగిందని, రెండో కంటికి ఇప్పుడే ఆపరేషన్ అవసరం లేదని వైద్యులు చెప్పారని అంటున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో చంద్రబాబు హౌస్ మోషన్ పిటిషన్ పై హైకోర్టు ఏ నిర్ణయం తీసుకోబోతోంది అన్న ఉత్కంఠ ఏర్పడింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates