షో చేసేది వీళ్ళిద్దరేనా ?

తెలంగాణా ఎన్నికల్లో రోడ్డు షోల బాధ్యత ఎక్కువగా ఇద్దరు మంత్రుల మీదే ఉంది. కేసీయార్ తో భేటీలో మంత్రులు కేటీఆర్, హరీష్ రావులకు ఈ విషయంలో క్లారిటీ వచ్చినట్లే ఉంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో వీళ్ళిద్దరినే రోడ్డుషోలు చేయమని కేసీయార్ ఆదేశించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. బహిరంగసభల్లో తాను ప్రసంగించేట్లు, రోడ్డుషోలు మంత్రులిద్దరూ చూసుకునేట్లుగా కేసీయార్ డిసైడ్ చేశారట. రోడ్డుషోలు చేయటానికి వీలుగా అవసరమైన రోడ్డు మ్యాపును కూడా రెడీ చేసి తనకు చూపించమని చెప్పారట.

ఇపుడీ మంత్రులిద్దరూ ఇదే పనిలో బిజీగా ఉన్నారు. కేసీయార్ బహిరంగ సభలు జరిగిన రెండు రోజుల గ్యాపులో తమ రోడ్డు షోల ఉండేట్లుగా మంత్రులు ప్లాన్ చేస్తున్నారు. కారణం ఏమిటంటే బహిరంగసభలు అయిన తర్వాత జనాల మనోగతం తెలుస్తుందనట. అయితే కొన్ని నియోజకవర్గాల్లో బహిరంగసభలతో సంబంధంలేకుండానే రోడ్డుషోలను ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈనెల 30వ తేదీనుండి రోడ్డుషోలు ప్రారంభమవుతున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ తో పాటు దక్షిణ తెలంగాణాలో కేటీయార్ రోడ్డుషోలు చేసేట్లుగా అనుకున్నారు.

మిగిలిన ఉత్తర తెలంగాణా జిల్లాల్లో హరీష్ రోడ్డుషోలు నిర్వహించబోతున్నారు. 30వ తేదీన ప్రారంభమవ్వబోయే రోడ్డుషోలు ప్రచారం ముగిసేనాటికి కనీసం రెండుసార్లయినా జరగేట్లుగా మంత్రులు ప్రణాళికలు రెడీ చేస్తున్నారు. రోడ్డుషోల ఉద్దేశ్యం ప్రధానంగా ప్రతిపక్షాలను ఉతికి ఆరేయటమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆరోపణలు చేయటంలోను, ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టడంలోను కేటీయార్, హరీష్ చాలా స్పీడుగా ఉంటారన్న విషయం అందరికీ తెలిసిందే.

మంత్రుల రోడ్డుషోలకు రోడ్ మ్యాప్ రెడీ అవుతున్నట్లుగానే కేసీఆర్ బహిరంగ సభలకు కూడా ప్లాన్ రెడీ అవుతోంది. మొత్తం 119 నియోజకవర్గాల్లో 100 నియోజకవర్గాల్లో బహిరంగసభలు నిర్వహించాలని కేసీయార్ రెడీ అవుతున్నారు. ఇందులో మొదటి విడతలో 41 నియోజకవర్గాల్లో బహిరంగసభలకు ప్లాన్ రెడీ అయ్యింది. ఈ సభల్లో వచ్చే జనాల రెస్పాన్స్ ను చూసిన తర్వాత అవసరమైతే తర్వాత ప్లాన్ లో మార్పులు చేసుకోవాలని కేసీయార్ నిర్ణయించారు. మొదటి విడత బహిరంగసభలను గురువారం నుండే ప్రారంభించబోతున్నారు. మునుగోడు, వనపర్తి, అచ్చంపేట బహిరంగసభలకు అభ్యర్ధులు, పార్టీ అన్నీ ఏర్పాట్లు చేసింది. మరి బహిరంగసభల్లో కేసీయార్ ఎలాంటి దూకుడు ప్రదర్శిస్తారో చూడాల్సిందే.