పొత్తు పెట్టుకున్న తెలుగుదేశంపార్టీ-జనసేన మధ్య సీట్ల పంపకాలే పెద్ద సమస్యగా మారబోతున్నాయి. నిజానికి జనసేన కోరుకునే లేదా పోటీచేయబోయే ఏ నియోజకవర్గమైనా తెలుగుదేశంపార్టీకి పట్టున్న నియోజకవర్గమనే చెప్పాలి. ఎందుకంటే టీడీపీ ప్రస్ధానం 40 ఏళ్ళ క్రితం మొదలైతే జనసేన అడుగులు మొదలైంది కేవలం 10 ఏళ్ళక్రితమే. అందులోను పోటీలోకి దిగింది 2019 ఎన్నికల నుండే. కాబట్టి జనసేన కోరుకునే ప్రతి నియోజకవర్గం టీడీపీకి పట్టున్నదే అయ్యుంటుంది.
అయితే ఇపుడు సమస్య ఏమొచ్చిందంటే గడచిన ఐదేళ్ళుగా తమ్ముళ్ళు బాగా వర్కవుట్ చేసుకుంటున్న నియోజకవర్గాలు, గెలుపు ఖాయమని అనుకుంటున్న నియోజకవర్గాలను జనసేన పోటీచేయాలని బలంగా కోరుకుంటుంటడమే. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ప్రచారం ఏమిటంటే రాయలసీమలోని ఉమ్మడి జిల్లాల్లో కొన్ని నియోజకవర్గాల్లో పోటీకి జనసేన రెడీ అయ్యిందట. తిరుపతి, చిత్తూరు, శ్రీకాళహస్తి, ఆలూరు, ఆళ్ళగడ్డ, అనంతపురం, పుట్టపర్తి, రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల పేర్లు వినబడుతున్నాయి. నిజానికి ఈ నియోజకవర్గాల్లో గెలుపుకు టీడీపీ ఎప్పటినుండో కష్టపడుతోంది.
సడెన్ గా పై నియోజకవర్గాల్లో జనసేన పోటీచేస్తుందంటే తమ్ముళ్ళకి షాక్ కొట్టడం ఖాయమనే చెప్పాలి. పోటీచేయాలని అనుకుంటున్న పై నియోజకవర్గాల్లో జనసేన బలమెంతో ఎవరికీ తెలీదు. పోయిన నియోజకవర్గాల్లో వచ్చిన ఓట్లను గమనిస్తే చాలా చోట్ల అసలు డిపాజిట్లే రాలేదు. ఇక్కడే జనసేనకు కేటాయించబోయే సీట్ల విషయంలో తమ్ముళ్ళల్లో టెన్షన్ పెరిగిపోతోంది. స్కిల్ స్కామ్ లో అరెస్టయి రిమాండులో ఉన్న చంద్రబాబునాయుడు ఎప్పుడు బయటకు వస్తారో తెలీదు. దాంతో పవన్-లోకేష్ జాయింటుగా రెండుపార్టీల ఆధ్వర్యంలో యాక్షన్ ప్లాన్ రెడీచేశారు.
చంద్రబాబు బయటుంటే పొత్తులు, సీట్ల కేటాయింపు విషయం వేరే రకంగా ఉండేది. కానీ ఇపుడు చంద్రబాబు జైలులో ఉన్నారు కాబట్టి పవన్ సీట్ల సంఖ్య, నియోజకవర్గాల విషయంలో గట్టిగా పట్టుబట్టే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ నేపధ్యంలోనే రాయలసీమలోని నియోజకవర్గాల పేర్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జనసేనకు పట్టులేదని అనుకునే రాయలసీమలోనే ఇన్నిసీట్లు అడుగుతోందంటే ఇక ఉభయగోదావరి, ఉత్తరాంధ్రలో ఎన్ని అడుగుతుందో ?