టీడీపీ-జనసేన మేనిఫెస్టోపై చర్చించాం :పవన్

టీడీపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు పొడిచిన తర్వాత జనసేన అధినేత పవన్ కళ్యాణ్, టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ల మధ్య ఈరోజు కీలక భేటీ జరిగింది. దసరా పండుగ నాడు ఈ ఇద్దరు నేతలు కలిసి రాజమండ్రిలో సమావేశమయ్యారు. జనసేన-టీడీపీ సమన్వయ కమిటీ తొలి సమావేశంలో ఇరు పార్టీలకు చెందిన పలువురు కీలక నేతలు పాల్గొన్నారు. దాదాపు 3 గంటలపాటు సాగిన ఈ సమావేశం తర్వాత మీడియాతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం అస్థిరతకు గురైందని, వైసీపీ తెగులుకు జనసేన-టీడీపీ కూటమే వ్యాక్సిన్ అని పవన్ సంచలన కామెంట్స్ చేశారు.

ప్రజలకు తామున్నాం అని భరోసానిచ్చేందుకే ఈ సమావేశం నిర్వహించామని పవన్ అన్నారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్, ఆంధ్రకొస్తున్న తనను సరిహద్దు దగ్గర ఆపేయడం వంటి పరిణామాలు అందరికీ తెలుసని, ఈ అరాచక ప్రభుత్వ విధానాలను అందరూ ఖండించాలని పవన్ పిలుపునిచ్చారు. వైసీపీ పాలసీ టెర్రరిజం అని, ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడమే వారి పని అని అన్నారు. అచ్చెంనాయుడు మొదలు చంద్రబాబు వరకు వైసిపి అరాచకాలకు బాధితులేనని పవన్ చెప్పారు. అటువంటి పరిస్థితుల్లోనే అస్థిరతకు గురైన ఏపీకి సుస్థిరత ఇవ్వాలని అనుకున్నానని, ఓట్లు చీలకూడదనే భావించానని పవన్ చెప్పారు.

తాము వైసీపీకి, వైసీపీ నాయకత్వానికి వ్యతిరేకం కాదని వారి విధానాలకు మాత్రమే వ్యతిరేకమని పవన్ చెప్పారు. ప్రతిపక్ష నేతలను అక్రమ కేసుల్లో జైలుకు పంపడం, ప్రత్యర్థులపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేయడం వంటి చర్యలకు వ్యతిరేకమని అన్నారు. 74 ఏళ్ల వయసున్న సీనియర్ రాజకీయవేత్తను జైల్లో పెట్టి నానా హింసలకు గురి చేస్తున్నారని, సాంకేతిక అంశాలతో బెయిల్ రాకుండా చేయడం బాధాకరమని పవన్ అన్నారు. రాష్ట్రంలో దారుణాలు చేసే వ్యక్తులందరికీ బెయిల్ వస్తుందని, కానీ అకారణంగా జైలు పాలైన చంద్రబాబుకు మాత్రం బెయిల్ రావడం లేదని విమర్శించారు.

వైసీపీ ప్రభుత్వం పోవాలి…జనసేన-టీడీపీ ప్రభుత్వం రావాలి అని పిలుపునిచ్చారు. రాజమండ్రిలో ఈ హోటల్ కు కూతవేటు దూరంలోనే రాజమండ్రి జైల్లో చంద్రబాబు ఉన్నారని, ఆయనకు మానసికంగా మద్దతు ఇచ్చేందుకే ఈ హోటల్లో సమావేశం నిర్వహించామని చెప్పారు. తాము కలిసికట్టుగా ఉన్నాం, రాష్ట్ర భవిష్యత్తును ముందుకు తీసుకువెళతాం అనే సందేశం ఇచ్చేందుకే ఈ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. ఎన్నికలకు 150 రోజులు సమయం కూడా లేదని, అందుకే ఉమ్మడి కార్యచరణపై ఆలోచనలు పంచుకున్నామని చెప్పారు. జనసేన-టిడిపి మేనిఫెస్టోలోని అంశాలను ఎలా కూర్పు చేయాలి అనే విషయంపై దాదాపు 3 గంటలపాటు చర్చించామని చెప్పారు.