జగనాసుర దహనానికి లోకేష్ పిలుపు

దసరా పండుగ సందర్భంగా ప్రజలకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వినూత్న పిలుపునిచ్చారు. ఈ విజయ దశమి పండుగను సైకో జగన్ అనే చెడుపై మంచి అనే చంద్రబాబు సాధించబోయే విజయంగా జరపాలని లోకేష్ పిలుపునిచ్చారు. దసరా నాడు దేశవ్యాప్తంగా రావణాసుర దహనం చేస్తుందని, మనం మాత్రం జగనాసుర దహనం చేద్దామని ప్రజలకు లోకేష్ పిలుపునిచ్చారు.

అక్టోబరు 23న రాత్రి 7 గంటల నుంచి 7.05 నిమిషాల వరకు దసరా నాడు ‘సైకో పోవాలి’ అని రాసి ఉన్న పత్రాలను దహనం చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఆ సమయంలో ప్రజలంతా బయటకు వచ్చి ఆ పత్రాలను తగులబెట్టిన ఫొటోలు, వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయాలని విజ్ఞప్తి చేశారు. దేశం చేస్తోంది రావ‌ణాసుర ద‌హ‌నం-మ‌నం చేద్దాం జ‌గ‌నాసుర ద‌హ‌నం అంటూ లోకేష్ పిలుపునిచ్చారు. అరాచ‌క, విధ్వంస‌క పాల‌న సాగిస్తున్న సైకో జ‌గ‌నాసురుడి పీడ పోవాల‌ని నిన‌దిద్దాం అని లోకేష్ అన్నారు.

మరోవైపు, టీడీపీ ఏపీ అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఈ రోజు విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారిని మనస్ఫూర్తిగా రెండు విషయాలు కోరుకున్నానని, చంద్రబాబు విడుదల కావాలని, కరువు బారిన పడిన రాష్ట్ర ప్రజలు కోలుకునే శక్తినివ్వాలని ప్రార్థించానని అన్నారు. చంద్రబాబు తెలుగు జాతి ఆస్తి అని, తెలుగు పిల్లల ప్రతిభ ప్రపంచానికి చాటిచెప్పిన వ్యక్తి అని కొనియాడారు. తెలుగు జాతి ముందుండాలని, సమాజ హితం కోరే చంద్రబాబు జైల్లో ఉండకూడదని, ఆయన బయటికి వచ్చేలా చూడాలని అమ్మవారిని కోరుకున్నానని అన్నారు.