ఇరు తెలుగు రాష్ట్రాలలో ప్రజలు దసరా పండుగను ఘనంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుకు విజయ దశమి పండుగను ప్రజలు జరుపుకుంటున్నారు. అయితే, టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో టీడీపీ నేతలు, కార్యకర్తలు మాత్రం పండుగను ఆనందంగా జరుపుకోలేకపోతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఏపీ ప్రజలకు, టీడీపీ నేతలు, కార్యకర్తలకు చంద్రబాబు బహిరంగ లేఖ రాశారు. వారందరికీ దసరా శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు అధైర్య పడొద్దని ధైర్యం చెప్పారు.
తాను జైలులో లేనని, ప్రజల హృదయాల్లో ఉన్నానని చంద్రబాబు అన్నారు. ప్రజల నుంచి తనను ఎవ్వరూ దూరం చేయలేరని, 45 ఏళ్లుగా తాను కాపాడుకుంటూ వస్తున్న విలువలు, విశ్వసనీయతను ఎవరూ చెరపలేరని అన్నారు. ఆలస్యమైనా న్యాయానిదే అంతిమ విజయమని, త్వరలో బయటికొచ్చి ప్రజల కోసం, రాష్ట్ర ప్రగతి కోసం రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తానని చెప్పారు. ఓటమి భయంతో తనను జైలులో పెట్టారని, ప్రజల మధ్యలో లేకపోయినా అభివృద్ధి రూపంలో ప్రతీ చోటా కనిపిస్తానని చెప్పారు.
45 ఏళ్ల ప్రజా జీవితం తన కళ్ల ముందు కదలాడుతోందని, తన రాజకీయ ప్రస్థానమంతా తెలుగు ప్రజల అభివృద్ధి.. సంక్షేమమే లక్ష్యంగా సాగిందని అన్నారు. కుట్రలతో తనపై అవినీతి ముద్ర వేయాలని ప్రయత్నించారని, తాను నమ్మిన విలువలు, విశ్వసనీయతను ఎన్నడూ చెరిపేయలేరు. ఈ చీకట్లు తాత్కాలికమినని, సూర్యుడి ముందు కారుమబ్బులు వీడిపోతాయని, సంకెళ్లు తన సంకల్పాన్ని బంధించ లేవని చెప్పారు. జైలు గోడలు తన ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేవని, జైలు ఊచలు ప్రజల నుంచి దూరం చేయలేవని అన్నారు.
ఈ దసరాకు పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని రాజమహేంద్రవరం మహానాడులో ప్రకటించానని, అదే రాజమహేంద్రవరం జైలులో తనను ఖైదు చేశారని చెప్పారు. త్వరలో బయటకొచ్చి పూర్తిస్థాయి మ్యానిఫెస్టో విడుదల చేస్తానని అన్నారు.