ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ…ఇప్పటివరకు ఈ పేరును సోషల్ మీడియాలో, మీడియాలో ఓ వర్గం…లైట్ తీసుకుంటుంది. ఇక, కొందరు నెటిజన్లయితే పప్పు అంటూ రాహుల్ ను ఎద్దేవా చేస్తుంటారు. ఇక, బీజేపీ అనుకూల మీడియా కూడా రాహుల్ సమర్థుడు కాదని చెప్పేందుక వచ్చిన ఏ అవకాశాన్ని వదులుకోలేదు. అందుకే, రాహుల్ గాంధీ అసలు ప్రధాని మోడీకి పోటీ కాదన్న భ్రమను మెజారిటీ ప్రజల్లో కల్పించడంలో ఆయా మీడియా సంస్థలు సక్సెస్ అయ్యాయనే చెప్పవచ్చు. ఈ క్రమంలోనే కరోనా మహమ్మారిపై, కరోనా వచ్చిన తర్వాత 10లక్షల కేసుల మార్క్ చేరుకోవడానికి మనకు పట్టే కాలంపై, మన ఆర్థిక వ్యవస్థపై కరోనా చూపే ప్రభావంపై రాహుల్ చేసిన హెచ్చరికలను, సూచనలను ఇటు మోడీ సర్కార్…అటు మోడీ అనుకూల మీడియా, సోషల్ మీడియా లైట్ తీసుకున్నాయి. కానీ, ఆ విషయాల్లో రాహుల్ చెప్పింది చెప్పినట్లు జరగడంతో ఇపుడు చాలామంది రాహుల్ విషయంలో కళ్లు తెరుస్తున్నారు. కరోనాతో కుదేలయిన ఆర్థిక వ్యవస్థ పుంజుకోవాలంటే వినియోగం పెరగడమే కీలకమని, భారీ సంస్కరణలు అవసరమని తాజాగా ఆర్‌బీఐ వార్షిక నివేదిక వెలువరించింది. ఈ విషయంపై రాహుల్ స్పందించారు. కొన్ని నెలలుగా తాను ఇవే అంశాల గురించి నెత్తీ నోరు బాదుకుంటున్నానని, అవే విషయాలను ఆర్‌బీఐ వార్షిక నివేదికలో ధృవీకరించిందని మోడీ సర్కార్ పై రాహుల్ మండిపడ్డారు.
మీడియాను ఉపయోగించుకుని సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించడం మంచిది కాదని, అలా చేయడం వల్ల పేదలకు ఒరిగేదేమీ లేదని రాహుల్ అన్నారు. ప్రభుత్వం ఎక్కువ డబ్బు ఖర్చు చేస్తేనే ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని, ఎక్కువ అప్పులు ఇవ్వడం ద్వారా ప్రయోజనం ఉండదని రాహుల్ అన్నారు. పేదలకు నగదు ఇవ్వాలని, పారిశ్రామికవేత్తలకు అధికంగా పన్నులు విధించకూడదని రాహఉల్ సూచించారు. మీడియాలో తప్పుడు ప్రచారం వల్ల ఉపయోగం లేదని, వినియోగాన్ని పెంచడం ద్వారా ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టవచ్చని మోడీ సర్కార్ కు చురకలంటించారు రాహుల్. గతంలోనూ రాహుల్ చేసిన పలు వ్యాఖ్యలపై కొన్ని మీడియా సంస్థలు వ్యగ్యంగా స్పందించాయి. అయితే, రాహుల్ హెచ్చరికలు వాస్తవ రూపం దాల్చడంతో సోషల్ మీడియాలో రాహుల్ పై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇకపై, రాహుల్ ఇలాగే తన దూకుడును కొనసాగిస్తే 2024 ఎన్నికల నాటికి మరింత బలమైన నేతగా, మోడీకి ప్రత్యర్థిగా ఎదుగుతారనడంలో ఎటువంటి సందేహం లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మోడీ సర్కార్ ను ఆర్బీఐ ఉంగరాల చేతితో మొట్టిందని…..రాహుల్ మామూలు చేతితో మొట్టారని సెటైర్లు వేస్తున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates