వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లనున్నాయని.. ఈ విషయాన్ని గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. తాజాగా తన పార్టీ కార్యకర్తలు, నాయకులకు సూచించారు. ఎక్కడా విభేదాలు వద్దని.. ఎవరితోనూ పేచీలు పెట్టుకోవద్దని ఆయనదిశానిర్దేశం చేశారు. తాజాగా మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో రాష్ట్ర అధికార ప్రతినిధులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. టీడీపీతో పొత్తు, వైసీపీ ప్రభుత్వం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని దిశానిర్దేశం చేశారు.
పార్టీ విధానాలకు ప్రతి ఒక్కరూ కట్టుబడి మాట్లాడాలని, ఉండాలని చెప్పారు. ఎవరూ కూడా వ్యక్తిగత అభిప్రాయాలు, దూషణలకు దిగవద్దని సూచించారు. పొత్తుల విషయంలో ఎవరూ మాట్లాడ వద్దని.. ఇప్పటికే ఒక నిర్ణయం తీసుకున్నామని.. దీనిలో ఎలాంటి మార్పూ ఉండబోదన్నారు. అయితే.. సీట్లు టికెట్ల వ్యవహారాన్ని తనకు వదిలేయాలని సూచించారు. పనిచేసేవారికి.. కులాలకు, మతాలకు అతీతంగా, ఆర్థిక పరిస్థితికి అతీతంగా టికెట్లు దక్కుతాయని సూచించారు. ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో అధికార ప్రతినిధులది గురుతర బాధ్యత అని తేల్చి చెప్పారు.
ఎక్కడైనా ఎవరితోనైనా.. కులాలు, మతాల గురించి మాట్లాడాల్సినప్పుడు రాజ్యాంగానికి లోబడి మాత్రమే మాట్లాడాలని సూచించారు. అనవసర విషయాలు, వ్యక్తిగత దూషణలు సమాజానికి హాని చేసే విధంగా చర్చలు ఉండకూడదని పవన్ కళ్యాణ్ తెలిపారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీని గద్దె దింపడమే లక్ష్యంగా జనసేన పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఆయన మరోసారి పిలుపునిచ్చారు. త్వరలోనే వారాహి యాత్ర ప్రారంభం కానుందని చెప్పారు. ఎన్నికలలో ఎలాంటి వ్యూహ ప్రతివ్యూహాలు వేయాలనే విషయాన్ని తమకు వదిలేయాలని కార్యకర్తలు పార్టీని బలోపేతం చేసేదిశగా పనిచేయాలని సూచించారు.